తీరొక్క పూలు కోటొక్క పాటల కోలాహాలం.. తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మ

తీరొక్క పూలు కోటొక్క పాటల కోలాహాలం.. తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మ

తీరొక్క పూలు.. కోటొక్క పాటల కోలాహలం. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక. బతుకుకు స్ఫూర్తినిచ్చిన సంబురం.. మ‌‌‌‌న తెలంగాణ బతుకమ్మ. ఆశ్వయుజ మాసం వచ్చిదంటే చాలు, పండుగల సీజన్ మొదలైనట్లే. ఈ మాసమంతా ఆకాశం నిర్మలంగా ఉంటుంది. శరత్కాలం.. పండు వెన్నెల రాత్రుల్లో సకల సృష్టికి బతుకునిచ్చే తల్లిని శక్తిరూపంగా భావిస్తూ.. ఆటపాటలతో పూజించడం మన సంప్రదాయం. 


పెళ్లై.. మెట్టినింటికి వెళ్లిన ఆడపడుచులను పుట్టింటికి ఆహ్వానిస్తారు. పేద, ధనిక తేడా లేదు. తమకున్నంతలో కొత్త బట్టలు, ఆభ‌‌‌‌ర‌‌‌‌ణాలు ధరిస్తారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చుతారు. తమ జీవితంలో ఎదురయ్యే కష్ట - సుఖాలను పాటల రూపంలో పాడుకుంటారు. మహాలయ అమావాస్య మొదలు అన‌‌‌‌గా ఎంగిలిపూల బ‌‌‌‌తుక‌‌‌‌మ్మ నుంచి.. దుర్గాష్టమి వరకు అన‌‌‌‌గా తొమ్మిదో రోజున స‌‌‌‌ద్దుల‌‌‌‌ బతుకమ్మను సాగనంపే వరకు, తెలంగాణ పల్లెల్లో సందడే సందడి. 

ఒక్కేసి పువ్వేసి సందమామ

‘ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జాము ఆయే సందమామ‌‌‌‌’ పాటలో బతుకమ్మ. ‘శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ.. చిత్రమై పోదురమ్మా గౌరమ్మా..’ భక్తిలో బతుకమ్మ. రంగురంగుల పువ్వుల కోక కట్టుకొని అభయమివ్వడానికి వచ్చిన ప్రకృతి మాత బతుకమ్మ. బతకడానికి కావలసినంత భరోసాని మ‌‌‌‌న‌‌‌‌ ఎదనిండా నింపే అమ్మనే బతుకమ్మ. తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ పండుగ ఇయ్యాల నుంచి కలర్​ఫుల్​గా ప్రారంభమవుతోంది. పితృ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పూల ధూంధాం జాతరకు పల్లెలు ముస్తాబవుతున్నాయి. ఈ సంబురంలో పాలుపంచుకునేందుకు తంగేడు, బంతి, చామంతి, గుమ్మడి, దోస, గునక, జిల్లేడు, మందార పూలు చెట్ల మీద పురి విప్పుకుని పిలుస్తున్నాయి. తంగేడు ఆకులు, దోస ఆకులు నేనంటే నేనని పోటీపడుతున్నాయి. చెరువులు కడుపునిండా నీరు నింపుకుని బతుకమ్మలకు అలల ఉయ్యాలలు సిద్ధం చేశాయి. వెదురు సిబ్బిలు ఇంటికి చేరుతుంటే, రాగి తాంబాళాలు అటక మీదినుంచి కిందికి దిగుతున్నాయి. 

వైభ‌‌‌‌వంగా బ‌‌‌‌తుక‌‌‌‌మ్మ వేడుక‌‌‌‌లు

బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు.. తెలంగాణ ముత్తయిదువులా మెరిసిపోతుంది. సాయంత్రం నుంచి మొదలు పెడితే నడి రాత్రి వరకు కూడా ఆడపడుచులందరి గొంతుక నిండా బతుకమ్మ పాటలే మార్మోగుతాయి. సీఎం రేవంత్ రెడ్డి సార‌‌‌‌థ్యంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం మ‌‌‌‌రోసారి బ‌‌‌‌తుక‌‌‌‌మ్మ ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా చాటాల‌‌‌‌ని సంక‌‌‌‌ల్పించడం హర్షణీయం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిప‌‌‌‌డేలా అంగ‌‌‌‌రంగ వైభ‌‌‌‌వంగా బ‌‌‌‌తుక‌‌‌‌మ్మ వేడుక‌‌‌‌లు నిర్వహించాలని స‌‌‌‌ర్కార్‌‌‌‌ నిర్ణయించింది. ఈ నెల 21న వ‌‌‌‌రంగ‌‌‌‌ల్ వెయ్యి స్తంభాల గుడి దగ్గర ఎంగిలి పూల బ‌‌‌‌తుక‌‌‌‌మ్మతో ప్రారంభ‌‌‌‌మయ్యే వేడుక‌‌‌‌లు.. 30న హైద‌‌‌‌రాబాద్‌‌‌‌లో స‌‌‌‌ద్దుల బ‌‌‌‌తుక‌‌‌‌మ్మతో ముగుస్తాయి. 28న హైద‌‌‌‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో 10 వేల మందితో 63 అడుగుల ఎత్తున బ‌‌‌‌తుక‌‌‌‌మ్మను పేర్చి గిన్నిస్‌‌‌‌ బుక్‌‌‌‌లో చోటు సంపాదించేలా ఘ‌‌‌‌నంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి తెలంగాణ ఆడ‌‌‌‌ప‌‌‌‌డుచుల‌‌‌‌కు నాణ్యమైనన చీర‌‌‌‌లు పంపిణీ చేస్తుండ‌‌‌‌టం శుభ‌‌‌‌ప‌‌‌‌రిణామం. 


ఇందిరా శోభ‌‌‌‌న్‌‌‌‌, 
కాంగ్రెస్ సీనియ‌‌‌‌ర్ నాయ‌‌‌‌కురాలు