
- రైస్, రాగి జావ పిండి డేటా యాప్‌లో అప్డేట్
- పారదర్శకత కోసం అమల్లోకి తేవాలని స్కూల్ ఎడ్యుకేషన్ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మిడ్డెమీల్స్ స్కీము అమలులో మరింత పారదర్శకత తీసుకురావడానికి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ ప్రతిరోజూ కేవలం స్టూడెంట్ల డేటాను మాత్రమే నమోదు చేస్తుండగా, ఇక సర్కారు అందించే సరుకుల డేటాను ఏ రోజుకారోజు మిడ్డెమీల్స్ యాప్‌లో అప్డేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సర్కారు విద్యాసంస్థల్లో చదివే సుమారు 17 లక్షల మంది పేద విద్యార్థులకు మిడ్డెమీల్స్ అందిస్తున్నారు.
దీంట్లో 8వ తరగతి వరకూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్కీము కొనసాగుతుండగా, 9,10 తరగతులకు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చును భరిస్తోంది. ఈ నెల నుంచే మిడ్డెమీల్స్ బిల్స్‌ను ఆన్లైన్ లో అప్లోడ్ చేయించే ప్రక్రియ ప్రారంభించిన విద్యాశాఖ అధికారులు తాజాగా.. సరుకుల విషయంలోనూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి నెలాఖరులో మాత్రమే స్కూల్పాయింట్లలో ఎన్ని క్వింటాళ్ల బియ్యం ఉన్నాయనే వివరాలను హెడ్మాస్టర్లు లెక్కగట్టేవాళ్లు. పిల్లలు బడుల్లో తినకపోయినా, గుడ్డు తినకపోయినా ఆ రోజు బడికి వచ్చే వారందరికీ ఇచ్చినట్టు, తిన్నట్టు కొంతమంది హెడ్మాస్టర్లు లెక్కలు రాసేవాళ్లు. దీనికి అధికారులు చెక్ పెట్టారు.
ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో మిడ్డెమీల్స్ కు సంబంధించి కీలక అప్డేట్స్ చేశారు. ఈ క్రమంలో ఎంతమంది తిన్నారు? ఎన్ని బియ్యం వాడారు?. రాగిజావా ఎంతమంది తిన్నారు? ఎంత పౌడర్ వాడారు? అనే వివరాలనూ యాప్‌లో అప్డేట్ చేయాల్సి ఉంది. దీనిద్వారా స్కూల్ పాయింట్ల వద్ద బియ్యం, రాగిజావ పిండి ఎంత ఉందనేది తెలుసుకునే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు తనిఖీలు చేసినప్పుడు.. అన్ని వివరాలు లెక్కలు చేయాల్సిన అవసరం లేకుండా యాప్ లో ఈ నెలలో ఎన్ని బియ్యం/రాగిజావ పిండి ఎంత వాడారు?.. ఎంత ఉంది? అనే డేటా కనిపించనున్నది. దీనిద్వారా అక్రమాలు జరిగితే గుర్తించే చాన్స్ ఉంది. కాగా, త్వరలోనే మిడ్డెమీల్స్ చెల్లింపులను గ్రీన్‌చానల్ ద్వారా అందించేందుకు సర్కారు అడుగులు వేస్తోంది.