
ముషీరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గీత వృత్తిదారుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ బృందం కోరింది. సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, ఆయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్ తమ బృందంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
బాలగౌని బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి.. అనే నినాదంతో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో 8 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం చెందినా పది లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటుందని వారి జీవితంలో మార్పు కోసం పెద్దపీట వేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.