- ప్లాంట్ పర్యవేక్షణకు ఐదుగురు ఐఏఎస్‌లు
- ఒక్కొక్కరు మూడు రోజులు అక్కడే ఉండి విధులు నిర్వహించేలా ప్లాన్
- కెపాసిటీ మేరకు పూర్తి స్థాయిలో యూనిట్లను నడపాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణలో నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాలపై ప్రభుత్వం చర్యలకు దిగింది. ప్లాంట్ స్టేజ్-1 చీఫ్ ఇంజినీర్ బి. సురేశ్‌ను సస్పెండ్ చేస్తూ జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్. హరీశ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ విషయంలో నిర్లక్ష్యం చేసే వారిని ఉపేక్షించబోమని సీఎం హెచ్చరించిన 24 గంటల్లోనే ఈ చర్య తీసుకోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో యాదాద్రి ప్లాంట్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్లాంట్ నిర్వహణ, బొగ్గు సరఫరా, నిల్వలను పర్యవేక్షించేందుకు ఐదుగురు ఐఏఎస్ అధికారులను నియమించింది. ఒక్కొక్కరు మూడు రోజుల పాటు ప్లాంట్‌లోనే ఉండి విధులు నిర్వహించాలని ఆదేశించింది.
నిర్లక్ష్యంపై క్రమశిక్షణ చర్యలు
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ స్టేజ్-1 చీఫ్ ఇంజినీర్ బి. సురేశ్‌పై విధుల్లో నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాలు, దుష్ప్రవర్తన కారణాలతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు జెన్కో సీఎండీ వెల్లడించారు. బుధవారం ఉదయం 9 గంటలకు జరిగిన సమీక్షలో ఆయన పనితీరుపై చర్చించారు. బొగ్గు సరఫరాలో కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, రైల్వే వ్యాగన్ల నుంచి బొగ్గు అన్‌లోడింగ్‌లో జాప్యం, కన్వేయర్ బెల్టు పనితీరు సరిగా లేకపోవడం, రోలర్ల మరమ్మతులను పట్టించుకోకపోవడం వంటి అంశాలను గుర్తించారు. ఆయన ప్రవర్తన ఏపీ ఎస్ఈబీ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉందని ఉన్నతాధికారులు నిర్ధారించారు. దీంతో సురేశ్‌ను తక్షణమే సస్పెండ్ చేయడంతోపాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
పర్యవేక్షణకు ఐదుగురు ఐఏఎస్‌లు
యాదాద్రి ప్లాంట్ నిర్వహణ, బొగ్గు సరఫరా, నిల్వలపై నిఘా పెట్టేందుకు ప్రభుత్వం ఐదుగురు ఐఏఎస్ అధికారులను నియమించింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ ఈ నెల 17 వరకు, విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వెంకటేశ్ ధోత్రే 18, 19 తేదీల్లో, సహకార సంఘాల ప్రత్యేక కమిషనర్ రాహుల్ రాజ్ 22 నుంచి 24 వరకు, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవో జెండాగే హనుమంత్ కొండిబా 25 నుంచి 27 వరకు, నీటిపారుదల శాఖ కమిషనర్ కిల్లు శివకుమార్ నాయుడు 28 నుంచి 30 వరకు అక్కడ విధులు నిర్వహించనున్నారు. ప్లాంట్‌లోని నాలుగు యూనిట్ల బొగ్గు సరఫరా వ్యవస్థ పనితీరు, రోజువారీ బొగ్గు సరఫరా, బొగ్గు నాణ్యత, సరఫరాలో అంతరాయాలు, విద్యుదుత్పత్తి లక్ష్యాల సాధనపై అధికారులు పరిశీలన చేయనున్నారు. ఉత్పత్తి తగ్గితే కారణాలను గుర్తించడంతోపాటు యూనిట్లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, బీహెచ్ఈఎల్ సంస్థ ద్వారా పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిని సమీక్షించనున్నారు. నాలుగు యూనిట్లూ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయా లేదా అన్నదానిపై నివేదికలు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
యాదాద్రిపై స్పెషల్ ఫోకస్
యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు యూనిట్లు ఉన్నాయి. వీటిలో నాలుగు యూనిట్లు మాత్రమే అందుబాటులోకి రావడంతో మొత్తం 3,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అయితే ఈ నాలుగు యూనిట్లను పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు రోజుకు 32 వేల టన్నుల జీ-9 బొగ్గు అవసరం. ప్రస్తుతం నైని బొగ్గు గని నుంచి 8 వేల నుంచి 12 వేల టన్నులు, స్థానికంగా మరో 3 వేల టన్నులు మాత్రమే సరఫరా అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో అవసరమైన బొగ్గులో సగం మాత్రమే అందుబాటులో ఉంటున్నది.
జీ-9 బొగ్గు సరఫరా విషయంలో సింగరేణి చేతులెత్తేయడంతో జెన్కో అధికారులు ఇటీవల మహానది బొగ్గు కోసం కోల్ ఇండియా ప్రతినిధులతో చర్చలు జరిపారు. రోజుకు 14 వేల టన్నులు సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరినా, ఇప్పటివరకు సరఫరా ప్రారంభం కాలేదు. మరోవైపు అవసరమైన బొగ్గును సమకూర్చుకోవడంలో ప్లాంట్ ఉన్నతాధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేయలేకపోతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
