ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన జీతాలు జూన్ నుంచే 

ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన జీతాలు జూన్ నుంచే 

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 30% ఫిట్‌మెంట్‌తో పెరిగిన జీతాలు ఈ నెల(జూన్) నుంచే ఉద్యోగులు, పెన్షనర్లకు అందించనుంది. ప్రస్తుత జూన్‌కు సంబంధించిన పెరిగిన వేతనాలు, పెన్షన్లు జూలైలో జమకానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, పెన్షనర్లు కలిపి మొత్తం 9,21,037 మందికి PRC ప్రకటిస్తూ అసెంబ్లీలో  సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు మంత్రివర్గం నిన్న(మంగళవారం) ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

PRCని 30% ఫిట్‌మెంట్‌తో అమలుచేస్తే.. ప్రభుత్వంపై ప్రతి నెలా సుమారు రూ.1000 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2.62 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, 2.67 లక్షల మంది పెన్షనర్లు కలిపి.. మొత్తం 5.29 లక్షల మందికి PRC ప్రయోజనాలు అందనున్నాయి. వీరితో పాటు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, వర్క్‌ చార్జ్‌డ్‌ ఉద్యోగులు, సుమారు 3 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచితే ప్రతి నెలా మరో రూ.250 కోట్ల వరకు భారం పడనుందని అంచనా. మొత్తంగా ప్రభుత్వం ప్రతినెలా అదనంగా రూ.1000 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుంది.