మద్యం దుకాణాల కేటాయింపులో దివ్యాంగుల రిజర్వేషన్‌‌‌‌లపై వివరణివ్వండి

మద్యం దుకాణాల కేటాయింపులో దివ్యాంగుల రిజర్వేషన్‌‌‌‌లపై వివరణివ్వండి
  • ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: మద్యం దుకాణాల కేటాయింపులో దివ్యాంగులకు రిజర్వేషన్‌‌‌‌లు కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. అయితే, కేటాయింపు ప్రక్రియపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మద్యం దుకాణాల కేటాయింపులో దివ్యాంగులకు రిజర్వేషన్‌‌‌‌ కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన శ్రీనివాస్‌‌‌‌ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ ఎన్‌‌‌‌ తుకారాంజీ విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గతంలో కూడా రిజర్వేషన్‌‌‌‌లు కల్పించారని.. దానిని 3 నుంచి 5 శాతానికి పెంచారన్నారు.

2021లో దుకాణాల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలతోపాటు గౌడ్​లకు రిజర్వేషన్‌‌‌‌లు కల్పించారన్నారు. దివ్యాంగులకు అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్‌‌‌‌లు కల్పించాలని ప్రభుత్వం గతంలో రిజర్వేషన్‌‌‌‌లు కల్పించిందన్నారు. అదనపు అడ్వకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ మహమ్మద్‌‌‌‌ ఇమ్రాన్‌‌‌‌ఖాన్‌‌‌‌ వాదనలు వినిపిస్తూ.. ఇది వాణిజ్యపరమైన అంశమని, రిజర్వేషన్‌‌‌‌లు కేవలం సంక్షేమ పథకాలకే వర్తిస్తాయన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి స్టేకు నిరాకరిస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి.. విచారణను వాయిదా వేశారు.