
- ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) కోసం యూనిఫామ్ హెచ్‌ఆర్ పాలసీ అమలుకు సంబంధించి తదుపరి ఆదేశాలిచ్చే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్, హైదరాబాద్‌లోని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్, ఎస్‌ఎల్‌ఈసీ సభ్యుడు సహా మరో ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ కన్వీనర్/రాష్ట్ర స్థాయి సాధికార కమిటీ(ఎస్‌ఎల్‌ఈసీ), పీఏసీఎస్ సెల్ హెడ్ గత నెల 22న జారీ చేసిన సర్క్యూలర్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సంఘం తరఫున అధ్యక్షుడు బోసుపల్లి గణేశ్, మరో 11 మంది ఇతరులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
అభ్యంతరాలకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా జారీ చేసి సర్క్యులర్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ సర్క్యులర్ సహకార సంఘాల చట్టం, ఆర్‌బీఐ మార్గదర్శకాలు, నాబార్డ్ చట్టాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్ జస్టిస్ పుల్ల కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున మాజీ ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతే బదిలీలకు సంబంధించి యూనిఫామ్ హెచ్‌ఆర్ పాలసీపై నిర్ణయం తీసుకోవాలని జూన్ 9న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా.. అవేమీ పట్టించుకోకుండా ఎస్‌ఎల్‌బీసీ సర్క్యులర్ జారీ చేసిందన్నారు.