
హైదరాబాద్, వెలుగు: సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తును కోర్టులు అడ్డుకోవని, కానీ సెటిల్మెంట్ల కోసం పోలీస్ స్టేషన్లను అడ్డాగా మార్చడం సరికాదని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఇలాంటి జోక్యాన్ని నివారించేందుకు సమావేశాలు నిర్వహించాలని డీజీపీకి సూచించింది. నిర్దిష్ట మార్గదర్శకాలను ఆన్‌లైన్‌లో, అన్ని పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాగోల్‌లోని ఓ ఇంటి వివాదంలో పోలీసులు జోక్యం చేసుకున్నారని పి. సుదర్శన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రూ.55 లక్షలు చెల్లించి కేసును పరిష్కరించుకోవాలని పోలీసులు బెదిరించారని, సివిల్ కోర్టు ఇంజంక్షన్ ఉన్నప్పటికీ తన ఫిర్యాదును పట్టించుకోలేదని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. గత నెల 19న ఉదయం 10 నుంచి రాత్రి 9:30 వరకు దర్యాప్తు పేరుతో పోలీస్ స్టేషన్లో తనను నిర్బంధించారని వివరించారు. స్పందించిన కోర్టు..నోటీసుల కోసం నిర్బంధించే అధికారం మీకు ఎక్కడిదని పోలీసులను ప్రశ్నించింది. గత నెల 19న సీసీ ఫుటేజీ సమర్పించాలని రాచకొండ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.