తెలంగాణ ధనిక రాష్ట్రమే కాని ప్రజలే పేదవారు

తెలంగాణ ధనిక రాష్ట్రమే కాని ప్రజలే పేదవారు

తెలంగాణ ధనిక రాష్ట్రం.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తరుచూ అనేక వేదికలపై చెప్పే మాట ఇది. సీఎం ప్రకటనలపై అనేక విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఆయన మాత్రం తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే అని ఘంటాపథంగా చెపుతున్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని సీఎం ఏ ప్రాతిపదికన ప్రకటిస్తున్నారో ఆర్థిక విశ్లేషకులకు కూడా అర్థం కావటం లేదు. బహుశా రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి రాష్ట్ర స్థూల ఆదాయం(జీఎస్డీపీ) రూ.5,05,849 కోట్లుగా ఉండటం, మిగులు బడ్జెట్ ఉండటం వలన కాబోలు తెలంగాణ ధనిక రాష్ట్రమని సీఎం కేసీఆర్​ ప్రకటించి ఉండవచ్చు. రాష్ట్రం సంపదపరంగా, రాష్ట్ర స్థూల ఆదాయం పెరుగుదలపరంగా(2011‌‌–20లో వార్షిక వృద్ధి రేటు 7.9 శాతం) చూస్తే తెలంగాణ ధనిక రాష్ట్రం కావచ్చు. కానీ సంపద పంపిణీపరంగా, ఆ పంపిణీలోని అసమానతల పరంగా పేదలు ఎక్కువగా ఉన్న సంపన్న రాష్ట్రంగా తెలంగాణ కనపడుతోంది. అభివృద్ధి అంటే మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి, సమ్మిళిత వృద్ధి లాంటి భావనలు ఉన్న ఈ తరుణంలో ఈ అంశాల్లో ఏ మాత్రం ప్రగతి సాధించని తెలంగాణ ధనిక రాష్ట్రం ఎలా అవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ చెపుతున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో సంపద ఉన్నా.. ఆ సంపద కింది స్థాయి వర్గాలకు పంపిణీ కానప్పుడు ధనిక రాష్ట్రమనే వ్యాఖ్యలకు అర్థం లేదనే విషయాన్ని గ్రహించాలి. ఆఫ్రో ఆసియా బ్యాంక్ నివేదిక ప్రకారంగా 559 లక్షల కోట్లతో పేద ప్రజలు ఉన్న సంపన్న దేశం మనది. అలాగే తెలంగాణ కూడా పేద ప్రజలు ఉన్న సంపన్న రాష్ట్రం.
సంపద పంపిణీ ఎలా జరుగుతున్నది
రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.5,05,849 కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల ఆదాయం రూ.9,78,373 కోట్లకు పెరగటమే అభివృద్ధిగా ప్రభుత్వాధినేతలు భావిస్తున్నారా? 2,27,145 రూపాయల తలసరి ఆదాయంతో దేశంలో తెలంగాణ రాష్ట్రం 7వ స్థానంలో ఉండటమే అభివృద్ధా! తెలంగాణ నుంచి దేశ కుబేరుల జాబితాలో 30 మందికి పైగా ఉండటమే ధనిక రాష్ట్రానికి ప్రామాణికమా? సంపద పెరగటం ఒక్కటే అభివృద్ధి కాదు. పెరిగిన సంపద ఎవరి చేతుల్లో కేంద్రీకృతమైనది, ఏ వర్గాలకు ఎంత శాతం పంపిణీ చేయబడుతోందనేదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. రాష్ట్ర స్థూల ఆదాయం, తలసరి ఆదాయం పరంగా చూసినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చెపుతున్నట్లు తెలంగాణ ధనిక రాష్ట్రమే. కానీ సంపద పంపిణీ పరంగా చూసినప్పుడు తెలంగాణ పేద ప్రజలు అధికంగా ఉన్న రాష్ట్రం అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.
అభివృద్ధి, సంక్షేమ డొల్లతనం బయటపడ్డది
‘‘తెలంగాణ ధనిక రాష్ట్రమే. సన్నాసులకు ఈ విషయం అర్థమైత లేదు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్​ మాట్లాడుతున్నారు. కానీ ఈ భావన రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను, స్థితిగతులను మారుస్తుందా అంటే మాత్రం అనుమానం కలగకమానదు. ఇటీవల నీతి ఆయోగ్ ప్రకటించిన సుస్థిరాభివృద్ధి (sustainable development) - 2020 ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం 69 మార్కులతో 11వ స్థానంలో నిలవడం సర్కారు చెబుతున్న అభివృద్ధి, సంక్షేమ డొల్లతనాన్ని బయటపెట్టింది. ఈ నివేదిక అనేక సామాజిక, ఆర్థిక అంశాల్లో రాష్ట్రం ర్యాంకు ద్వారా వెనుకబాటుతనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. దేశంలో అసమానతల తగ్గింపులో తెలంగాణ రాష్ట్రం 17వ స్థానంలో, శాంతి, న్యాయంలో 20వ స్థానంలో, వైద్యం, ఆరోగ్యంలో 19వ స్థానంలో, ఆకలి, పేదరికం లేకపోవటంలో వరుసగా 17వ, 15వ స్థానంలో ఉంది. ఇక మానవాభివృద్ధి సూచికలో(హెచ్​డీఐ) తెలంగాణ దేశంలో 16వ స్థానంలో ఉండటాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి. ఇటీవల కేంద్ర అర్బన్​ డెవలప్​మెంట్​ శాఖ ప్రకటించిన ‘ఈజ్​ ఆఫ్ లివింగ్’ జాబితాలో టాప్​ 20 నగరాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కటంటే ఒక్క నగరం కూడా చోటు సంపాదించలేదంటేనే.. మన ధనిక రాష్ట్రంలో నగరాలు, అ నగరాల్లోని ప్రజల జీవన స్థితిగతులను అంచనా వేయవచ్చు. విద్యా ప్రమాణాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 20వ స్థానంలో నిలవటం, నిరుద్యోగంలో 7వ స్థానం, రైతుల ఆత్మహత్యల్లో కర్నాటక, మహారాష్ట్ర తర్వాత తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. ఇక అప్పులు ఎక్కువగా చేస్తున్న రాష్ట్రాల్లో 13వ స్థానంలో ఉండటం తెలంగాణ దయనీయస్థితిని తెలియజేస్తున్నది.
సర్కారు ఎజెండా మారాలె
ఆసరా పెన్షన్లు, రైతు బంధు, దళితబంధు పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం అని చెపుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి - సంక్షేమ ఎజెండా మారాలని రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరగటమే కాకుండా రైతుల ఆదాయాలు పెరిగి, సంపద పంపిణీలో అసమానతలు తగ్గినప్పుడే బంగారు తెలంగాణతోపాటు బతుకుదెరువును ఇచ్చి బతుకులు మార్చే తెలంగాణగా నిలబడుతుంది. జాబ్ లెస్ గ్రోత్ ఈజ్ జాయ్ లెస్ గ్రోత్ అంటూ ఉంటారు. అదే నిజమైతే తెలంగాణ ధనిక రాష్ట్రమేమోకానీ, బతుకుదెరువు లేని బంగారు తెలంగాణ భవిష్యత్ లేని రాష్ట్రంగా మిగిలిపోతుంది.
ధనిక రాష్ట్రమైతే భూములెందుకు అమ్ముతున్నరు
తెలంగాణ ధనిక రాష్ట్రమైతే ప్రభుత్వ నిర్వహణ కోసం సర్కారు భూములను ఎందుకు అమ్ముతున్నారు. ప్రతినెలా పెద్ద ఎత్తున 2 వేల కోట్ల రూపాయల అప్పు ఎందుకు తెస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం భూముల వేలం ద్వారా 3 వేల కోట్ల రూపాయాలను సమకూర్చుకుంది. రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి 75 వేల కోట్ల రూపాయలుగా ఉన్న రాష్ట్ర రుణ భారం.. 2021-22 బడ్జెట్ ప్రకారం 2 లక్షల 86 వేల కోట్ల రూపాయలకు పెరగటమే కాకుండా తలసరి అప్పు రూ.81,935గా ఉన్నదనే విషయాన్ని గమనించాలి. రాష్ట్ర సంపద పెరగటం కొద్ది మందికి ప్రయోజనం కలిగిస్తే, అప్పులు పెరగటం వల్ల ప్రజలందరిపై భారం పడుతుందనే విషయం మనం మర్చిపోకూడదు. తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండింది.. లక్ష కోట్ల రూపాయల విలువ చేసే పంట పండిందని చెపుతున్న ముఖ్యమంత్రి.. రైతుల ఆదాయాలు మాత్రం ఆ స్థాయిలో ఎందుకు పెరగలేదో చెప్పాలి. రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగలేదో చెప్పాలి.