
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. వీటిపై మున్సిపల్ శాఖ సెక్రటరీ, సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) టీకే.శ్రీదేవి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా నోటిఫికేషన్లు జారీ చేశారు. గత నెలలో డివిజన్లు, వార్డుల విభజనకు షెడ్యూల్ జారీ చేయగా.. పబ్లిక్, ప్రజా ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. వీటిని మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లు, సీడీఎంఏ పరిశీలించింది.
ఈ రిపోర్ట్ ను మున్సిపల్ శాఖకు పంపగా తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ను కమిషనర్లు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఆఫీసులతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంచారు. కొత్త మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో వార్డులు, డివిజన్లతో హద్దులు సమగ్రంగా ఉన్నట్లు మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. కాగా, కొత్త వార్డుల విభజన పూర్తిచేసిన 30 మున్సిపాలిటీలకుగాను 18 కొత్తగా ఏర్పడినవి, మరో 12 మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం కారణంగా వార్డుల పునర్విభజన చేశారు. వీటితో పాటు మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం కార్పొరేషన్లను ఏర్పాటు చేయగా, కరీంనగర్ కార్పొరేషన్ లో కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేశారు.