ధనికుల సంఖ్య దండిగానే.. ఇండియాలో పెరుగుతున్న మిలియనీర్లు

ధనికుల సంఖ్య దండిగానే.. ఇండియాలో పెరుగుతున్న మిలియనీర్లు

న్యూఢిల్లీ: మనదేశంలో సంపద వేగంగా పెరుగుతున్నట్టు వెల్లడయింది. 2021లో 4.58 లక్షలుగా ఉన్న మిలియనీర్ల కుటుంబాల సంఖ్య (నికర విలువ కనీసం రూ. 8.5 కోట్లు) 2025 నాటికి 90 శాతం పెరిగి 8.71 లక్షలకు చేరింది. మెర్సిడెస్ -బెంజ్ హురున్ ఇండియా  వెల్త్ రిపోర్ట్ 2025 ఈ వివరాలను వెల్లడి చేసింది. 

 రిపోర్ట్​ ప్రకారం..దేశంలో అత్యధికంగా ముంబైలో 1.42 లక్షల మిలియనీర్ కుటుంబాలు ఉన్నాయి. దీని తర్వాత ఢిల్లీ (68,200), బెంగళూరు (31,600) ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే,  1.78 లక్షల మిలియనీర్ కుటుంబాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. రాష్ట్ర జీఎస్​డీపీలో 55 శాతం పెరుగుదల దీనికి మద్దతు ఇస్తోంది. 

మెర్సిడెస్- బెంజ్ అమ్మకాలు, కొత్త బిలియనీర్ల సంఖ్య, సెన్సెక్స్ పనితీరు, జీడీపీని కలిపి రూపొందించిన ఎంబీహెచ్​ఎక్స్​ దాదాపు 200 శాతం పెరిగింది. ఇది ప్రపంచ అనిశ్చితుల మధ్య కూడా సంపద వృద్ధి చెందుతోందని సూచిస్తోంది.  దాదాపు 35 శాతం మంది మిలియనీర్లు డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ యాప్​లను ఎక్కువగా వాడుతున్నారు.  ఎక్కువగా స్టాక్స్, రియల్ ఎస్టేట్, బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. 

బ్రాండ్ల విషయానికి వస్తే.. రోలెక్స్, తనిష్క్, ఎమిరేట్స్, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ మొదటి స్థానంలో ఉన్నాయని హురున్ ఇండియా ఫౌండర్​, చీఫ్​ రీసెర్చర్ అనస్ రెహమాన్ జునైద్ అన్నారు. మెర్సిడెస్- బెంజ్ ఇండియా ఎండీ అండ్​ సీఈఓ సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ.. ఈ ఇండెక్స్ భారతదేశంలోని సంపన్న వర్గాల స్థితిగతులు, లగ్జరీ వస్తువుల వినియోగంలో వస్తున్న మార్పులను చూపిస్తుందని తెలిపారు.