సర్కారు బడులను బలోపేతం చేస్తాం : మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు

సర్కారు బడులను బలోపేతం చేస్తాం : మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు
  • ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు 

మహదేవపూర్/ మహాముత్తారం, వెలుగు: తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఐటీశాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్​బాబు అన్నారు. జయశంకర్​భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, కాటారం, మహాముత్తారం  మండలాల్లో సోమవారం పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. మహదేవ్ పూర్ ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో గివ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సౌజన్యంతో విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు.

అంతకుముందు వనమహోత్సవంలో భాగంగా స్కూల్​ ఆవరణలో కలెక్టర్​ రాహుల్​శర్మ, ట్రేట్​ప్రమోషన్​చైర్మన్​ అయిత ప్రకాశ్​రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఖేల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మండలంలో ఈ విద్యాసంవత్సరంలో 250 మంది విద్యార్థులను సర్కారు బడుల్లో అడ్మిషన్​ పొందేలా కృషి చేసిన టీచర్స్​​ను అభినందించారు.

మహదేవ్ పూర్ పాఠశాలను పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని  రూ.15 కోట్ల సీఎస్​ఆర్​ నిధులతో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. కాగా, ప్రశాంత వాతావరణంలో సరస్వతీ నిలయాలుగా ఉండే మంథని నియోజకవర్గాన్ని కొన్ని దుష్టశక్తులు రక్తపాత ప్రాంతంగా మార్చాలని చూస్తున్నాయని ఆరోపించారు.అనంతరం కాటారం మండల కేంద్రంలో కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, పలిమెల, మల్హర్ మండలాల్లో జరుగుతున్న ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు. ఇచ్చిన హామీ మేరకు కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేసేందుకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు ఇస్తున్నామని మంత్రి తెలిపారు.

 రూ.36,34,751 లక్షలను ప్రమాద బీమా, రుణ బీమా రూ.30 లక్షలు, బ్యాంకు లింకేజీ రూ.10.30 కోట్లు, రూ.69.03 లక్షలు వడ్డీలేని రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. డివిజన్ లో మొత్తం 3161 మహిళా సంఘాల్లో 32070 మంది సభ్యులున్నారని తెలిపారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఆరుగురు రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. మహా ముత్తారం మండలంలో రూ.కోటీ20 లక్షలతో నిర్మించిన మండల పరిషత్ ఆఫీస్, రూ.73 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్​ఆఫీస్​ను మంత్రి ప్రారంభించారు.

 మండల పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోనంపేటకి చెందిన కాంగ్రెస్ లీడర్ సమ్మయ్య భార్య మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్, అడిషనల్​ కలెక్టర్ విజయ లక్ష్మీ, డీఈవో రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.