- 12 రెట్లు పెరిగిన ఫారిన్ లిక్కర్ అమ్మకాలు
- క్లాస్‌కు కల్చర్.. మాస్‌కు వ్యసనం
- 2014లో ఏడాదికి 246 లక్షల కేసుల బీర్లు
- ఇప్పుడు 4 నెలల్లోనే 221 లక్షల కేసులు!
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గడిచిన 12 ఏండ్ల కాలంలో రాష్ట్రంలో మద్యం వినియోగం రెట్టింపయ్యింది. 2014 నుంచి 2026 జులై వరకు ఎక్సైజ్ శాఖ లెక్కలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది. రాష్ట్రం వచ్చిన కొత్తలో ఏడాదికి 412.57 లక్షల కేసులుగా ఉన్న లిక్కర్సేల్స్.. సరిగ్గా పదేండ్లు తిరిగేసరికి ఏకంగా 910 లక్షల కేసుల మార్కును దాటేశాయి.
2023–24లో 910.79 లక్షల కేసులు సేల్ అవగా, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే ఏకంగా 349.74 లక్షల కేసుల అమ్మకాలతో ఆల్‌టైమ్ రికార్డు నమోదైంది. పల్లె, పట్నం తేడా లేకుండా గల్లీగల్లీలో బెల్టుషాపులు అందుబాటులోకి రావడం, చాలా మందికి మద్యపానం రోజువారీ అలవాటుగా మారడం, పండుగలు, -దావత్‌లు, ఎన్నికల సమయంలో లిక్కర్ తీసుకోవడం సామాజిక ఆనవాయితీగా తయారవడం, హైదరాబాద్‌లో కాస్మోపాలిటన్ కల్చర్ వంటివి లిక్కర్ సేల్స్ భారీగా పెరగడానికి కారణాలుగా ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. అదేసమయంలో ఫారిన్ బ్రాండ్ల వైపు జనం మొగ్గు చూపుతుండడంతో విదేశీ మద్యం అమ్మకాలు ఏకంగా12 రెట్లు పెరగడం ఆసక్తికరంగా మారింది.
2014–15లో మొత్తం 412.57 లక్షల కేసుల మద్యం అమ్ముడు పోగా, 2016–17లో 608.86 లక్షలకు, 2018–19లో 841.14 లక్షలకు సేల్స్ చేరాయి. లాక్‌డౌన్ వల్ల 2020–21లో 608.79 లక్షల కేసులకు పడిపోయినా, మరుసటి ఏడాదే 717.62 లక్షల కేసులతో మద్యం అమ్మకాలు పుంజుకున్నాయి. ఆ తర్వాత 2023–24లో 910.79 లక్షలు, 2024–25లో 910.24 లక్షల కేసులతో పీక్ స్టేజ్‌కు చేరాయి.
2025–26లో కాస్త తగ్గి 870.23 లక్షల కేసులు అమ్ముడవగా.. ప్రస్తుత 2026–27 ఏడాదిలో మొదటి నాలుగు నెలల్లోనే ఏకంగా 349.74 లక్షల కేసుల మద్యం ఖాళీ అయింది. అంటే 2014లో 12 నెలలు తాగిన మద్యాన్ని.. ఇప్పుడు కేవలం నాలుగు నెలల్లోనే తాగేస్తున్నారంటే రాష్ట్రంలో లిక్కర్ ఏ స్థాయిలో ఏరులై పారుతోందో అంచనా వేయవచ్చు.
కారణాలు ఎన్నో..
తెలంగాణలో ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు పెరగడం వెనుక పలు సామాజిక, పాలనాపరమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడ్డాక ‘గుడుంబా రహిత తెలంగాణ’ పేరిట ప్రభుత్వం నాటుసారాపై ఉక్కుపాదం మోపడంతో పేదలు, శ్రామికులు క్రమంగా చీప్ లిక్కర్ వైపు మళ్లారు. దీనికితోడు మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ఆబ్కారీ శాఖను లిక్కర్సేల్స్పెంచేందుకు సర్కారు వాడుకున్నది.
ప్రభుత్వం పెట్టిన టార్గెట్లు రీచ్అయ్యేందుకు ఎక్సైజ్ సిబ్బంది కళ్లు మూసుకోవడంతో వాడవాడలా బెల్టుషాపులు వెలిశాయి. ప్రతిచోటా 24 గంటలపాటు లిక్కర్ అందుబాటులో ఉండడంతో లక్షలమందికి మద్యపానం ఒక వ్యసనంగా మారింది. మరోవైపు హైదరాబాద్‌లో ఐటీ, రియల్ ఎస్టేట్ బూమ్‌తో తలసరి ఆదాయం పెరిగి పబ్ కల్చర్, మైక్రో బ్రూవరీల దందా విస్తరించింది.
మరోవైపు ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా భావిస్తున్న ప్రభుత్వాలు ఎలైట్ వైన్ మార్టులు, వాక్-ఇన్ స్టోర్లకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చాయి. వీటికి తోడు పండుగలు, జాతర్లు, దావత్‌లు.. వరుస ఎన్నికల సీజన్లు మద్యం అమ్మకాలకు ఆజ్యం పోశాయని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.
బీర్ల అమ్మకాలు ఇలా..
సంవత్సరం కేసులు
2014-15 246.08 లక్షలు
2018-19 496.06 లక్షలు
2020-21 273.08 లక్షలు(కరోనా ఎఫెక్ట్)
2023-24 547.96 లక్షలు
2024-25 536.11 లక్షలు
2025-26 487.30 లక్షలు
2026-27 220.89 లక్షలు(ఏప్రిల్– జులై)
ఐఎంఎఫ్ఎల్ ఇలా.. సంవత్సరం కేసులు
2014-15 166.21 లక్షలు
2016-17 271.84 లక్షలు
2017-18 310.33 లక్షలు
2019-20 334.12 లక్షలు
2021-22 368.81 లక్షలు
2024-25 371.21 లక్షలు
2025-26 379.75 లక్షలు
2026-27 127.92 లక్షలు (ఏప్రిల్– జులై)
ఖరీదైన ఫారిన్ లిక్కర్ (విదేశీ మద్యం) ఇలా..
2014-15 0.25 లక్షల కేసులు
2020-21 1.35 లక్షలు
2022-23 2.40 లక్షలు
2023-24 2.90 లక్షలు
2024-25 2.88 లక్షలు
2025-26 3.14 లక్షలు
2026-27 –
