
- కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్కుమంత్రి పొన్నం వినతి
- క్లియరెన్స్ లు రాక వందకుపైగా ప్రాజెక్టులు నిలిచిపోయాయని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను పొన్నం ఆయన ఆఫీసులో కలిశారు. రాష్ట్రంలో పలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ అంశాలు, పర్యావరణ అనుమతులు, అటవీ భూములకు అనుమతులు, రోడ్డు విస్తరణ ప్రాజెక్టులపై చర్చించారు.
గతంలో సీఎం రేవంత్, మరో మంత్రితో కలిసి పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులపై చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే... తాజాగా మహారాష్ట్రలోని పూణేకు సంబంధించిన ఫారెస్ట్ ల్యాండ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల అనుమతులకు అడ్డుగా మారాయి. ముఖ్యంగా రెవెన్యూ శాఖ నియంత్రణలో ఉన్న అటవీ భూములను గుర్తించాలని కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ అంశంపైనా కేంద్ర మంత్రితో పొన్నం చర్చించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ను కేంద్రం తిరిగి పంపింది. ఆ డీపీఆర్ ను తాజాగా సరిచేసి కేంద్ర అనుమతికి పంపిన విషయాన్ని భూపేందర్ కు పొన్నం తెలిపారు. ఆ డీపీఆర్ ను పరిశీలించి ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇవ్వాలని పొన్నం కోరారు. అలాగే, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టుకూ అనుమతులు ఇవ్వాలని విన్నవించారు. అటవీ, పర్యావరణ అనుమతులు రాక వందకుపైగా ప్రాజెక్టులు ఆగిపోయాయని తెలిపారు.