కర్నాటక తీరుతో మాకు నష్టం..సుప్రీంలో తెలంగాణ వాదన

కర్నాటక తీరుతో మాకు నష్టం..సుప్రీంలో తెలంగాణ వాదన
  •     కృష్ణా నదిపై రూ.13 వేల కోట్ల ప్రాజెక్టులు నిర్మించింది 
  •     నదీ జలాలపై సుప్రీంలో తెలంగాణ వాదన 

న్యూఢిల్లీ, వెలుగు: కృష్ణా నదిపై కర్నాటక నిర్మించిన ప్రాజెక్టులు, కాలువలతో కింది రాష్ట్రాలైన ఏపీతో పాటు తమకు నష్టం జరుగుతోందని తెలంగాణ సుప్రీంకోర్టులో వాదించింది. ఈ ప్రాజెక్టులకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లు ఉన్నాయా? లేదా? అనే దానిపై కూడా కర్నాటక సర్కార్ కోర్టుకు వివరాలేమీ ఇవ్వలేదని తెలిపింది. కృష్ణా జలాల కేటాయింపుపై కర్నాటక వేసిన ఇంటర్ లాక్యూటరీ అప్లికేషన్(ఐఏ) పై మంగళవారం సుప్రీంలో వాదనలు జరిగాయి. కృష్ణా నది జలాలను పంపిణీ చేస్తూ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 2010లో అవార్డు వెల్లడించిందని,   2013లో సవరించిన అవార్డుతో గెజిట్ రిలీజ్ చేయాలని కర్నాటక 2014లో సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే తీర్పును సమీక్షించాలని ఐఏను దాఖలు చేసింది. ఈ పిటిషన్  జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది.  కర్నాటక తరపున సీనియర్ లాయర్ శ్యామ్ దివాన్, తెలంగాణ తరపున సీనియర్ లాయర్ వైద్య నాథన్ వాదనలు వినిపించారు. 

అదనపు జలాల వినియోగం కోసమే ప్రాజెక్టులు: కర్నాటక 

రూ.13 వేల కోట్లతో కృష్ణా రివర్ పై ప్రాజెక్ట్ లు, కాలువలు నిర్మించినట్లు శ్యామ్ దివాన్  బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అదనపు జలాల్లో 75 టీఎంసీల వినియోగం నిమిత్తమే ప్రాజెక్టులు నిర్మించినట్లు తెలిపారు. స్పందించిన కోర్టు.. 75 టీఎంసీల నీటికే అనుమతి కోరుతున్నారా? లేక షరతులతో కూడిన నీటి వినియోగానికి కేంద్రం అనుమతి వద్దంటున్నారా?  అని ప్రశ్నించింది. అయితే షరతులు అవసరం లేదని, అవార్డుపై స్టే ఎత్తివేయాలని దివాన్‌‌ విజ్ఞప్తి చేశారు. దీనిపై వైద్య నాథన్ జోక్యం చేసుకొని... ట్రిబ్యునల్‌‌ అవార్డు గెజిట్‌‌ ప్రచురణ వద్దని కోర్టు 2011లో ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కర్నాటక కాలువలు నిర్మించిందని చెప్పారు. అందులోనూ కేంద్ర శాఖల అనుమతి లేకుండా కింది రాష్ట్రాలకు నష్టం కలిగేలా సొంత నిర్ణయాలతో ప్రాజెక్ట్ లు చేపట్టిందని ఆరోపించారు. కాగా, మహారాష్ట్ర తరఫు సీనియర్‌‌ లాయర్ నాఫడే వాదిస్తూ కర్నాటక అప్లికేషన్‌‌పై  అభ్యంతరం లేదన్నారు. వాదనలు విన్న కోర్టు.. విచారణను బుధవారానికి వాయిదా వేసింది.