కార్మికుల పక్షాన నిలబడని జన్మ వృధా

కార్మికుల పక్షాన నిలబడని జన్మ వృధా
  • విశాఖ ఉక్కు ఎవరి భిక్ష కాదు.. 32మంతి ఆత్మబలిదానంతో పోరాడి సాధించుకున్నాం
  • పెట్టుబడుల ఉపసంహరణ కొత్తగా వచ్చింది కాదు..1992 నుంచే మొదలైంది
  • ఓడినా ఎక్కడికీ పారిపోలేదు.. ఉన్న ఒక్క ఎమ్మెల్యేను వైసీపీ వాళ్లు తీసేసుకున్నారు
  • నాకు ఒక్క ఎంపీ ఉన్నా.. ప్రైవేటు బిల్లు పెట్టి చర్చకు తెచ్చేవాడ్ని
  • వైసీపీ నాయకులు ద్వంద్వ రాజకీయాలు చేస్తున్నారు
  • మన పోరాటం మనం చేయకుండా... కేంద్రాన్ని అనడం ఎందుకు ? 
  • వారం రోజుల్లో అఖిలపక్షం పిలవాలి.. లేదంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం
  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 

విశాఖపట్టణం: జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కార్మికుల పక్షాన నిలబడని జన్మ వృధా అంటూ.. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న విశాఖ ఉక్కు ఉద్యమానికి జనసేన పార్టీ మద్దతు ఇస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదంతో ఆదివారం కూర్మన్నపాలెం వద్ద జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శ్రీశ్రీ రాసిన ‘నేను సైతం’ కవితను చదివి వినిపంచారు. నాయకుడు, కవి ఎప్పుడూ కార్మికుల వైపే నిలబడాలని.. దేశం అభివృద్ధి సాధించాలంటే విశాఖ ఉక్కు లాంటి పరిశ్రమలు చాలా అవసరం అన్నారు. ఉక్కు పరిశ్రమలు లేకపోతే దేశం ముందుకు వెళ్లలేదని, ప్రాణాలు పణంగా పెట్టి ఎందరో పోరాటం చేస్తేనే విశాఖ ఉక్కు పరిశ్రమ సాకారమైందని అన్నారు. నాడు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదం అందరిలోనూ భావోద్వేగం నింపిందని గుర్తు చేస్తూ...  ఆనాడు పోలీసుల కాల్పుల్లో 32 మంది చనిపోయారు.. వారి ఆత్మబలిదానాల అనంతరం విశాఖ ఉక్కు వచ్చిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 
పారిశ్రామిక సంస్థలు సుభిక్షంగా ఉండాలని కోరుకునే వారిలో తానూ ఒకడ్నని వివరిస్తూ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తున్నారన్న వార్త వినగానే ఎంతో బాధ కలిగిందన్నారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి వెంటనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి పరిస్థితిని వివరించామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇతర పరిశ్రమల్లో పెట్టుబడులు ఉపసంహరించి ప్రైవేటీకరించే ఇతర పరిశ్రమల తరహాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను చూడొద్దని ఆయనకు నివేదించామని తెలిపారు. ఆంధ్రుల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని, 18 వేల మంది రైతులు భూములు వదులుకుంటే స్టీల్ ప్లాంట్ వచ్చిందని అమిత్ షాకు వివరించామని పేర్కొన్నారు.
మేం చెప్పిన అంశాలను అమిత్ షా సావధానంతో విన్నారు
ఢిల్లీ వెళ్లిన నాకు అమిత్ షా వెంటనే అపాయింట్ మెంట్ ఇచ్చారు.. మేం చెప్పిన అంశాలను అమిత్ షా సావధానంతో విన్నారు.. నా పరిస్థితిని మీరు గమనించండి.. నాకు ఒక్క ఎంపీ కూడా లేడు.. ఉన్న ఒక్క ఎమ్మెల్యేని వైసీపీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు... అయినా నాకు ఆనాడు అమిత్ షా ఎందుకు అపాయింట్ మెంట్ ఇచ్చారు?  ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారని కాదు... మీరు (ప్రజలు) ఉన్నారనే నాకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. ప్రజాబలం ఉంది కాబట్టే నాకు విలువ లభిస్తోంది. లేకపోతే ఒక్క క్షణంలో గడ్డిపోచలా తీసేసి పక్కనపడేసేవారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 
ఏ పరిశ్రమకు నష్టాలు లేవు.. నష్టాలు రాని పరిశ్రమ ఉందీ అంటే ఒక్క వైసీపీ రాజకీయ పరిశ్రమే
నిన్నటి తరాల వారు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి ఎంతో కష్టపడి స్టీల్ ప్లాంట్ మన చేతుల్లో  పెట్టారు.. అలాంటిది అన్యాక్రాంతం అవుతుంటే అందరిలాగే బాధ కలుగుతోంది.. ఏ పరిశ్రమకు నష్టాలు రావో చెప్పండి? ఏ వ్యాపారానికి నష్టాలు రావో చెప్పండి? ఏ పరిశ్రమకు అప్పులు లేవో చెప్పండి? ఒకవేళ నష్టాలు రాని పరిశ్రమ ఉందీ అంటే అది ఒక్క వైసీపీ రాజకీయ పరిశ్రమే" అని పవన్ కళ్యాణ్ అన్నారు. నాకు ఎలాంటి స్వార్థం లేదు. భావితరాలు బాగుండాలన్నదే నా ఆశయం.. అని పవన్ కళ్యాన్ స్పష్టం చేశారు.
పారిపోయేటోడ్ని కాదు
సమస్యలు వచ్చినప్పుడు ఎవరూ నిలబడరు.. సైనికులు నిలబడతారు.. వీర మహిళలు నిలబడతారు.. అలాగే నాకు సమస్యలు వస్తే తట్టుకుని నిలబడతా.. పారిపోయేటోడ్ని కాదు.. ముందడుగు వేయడమే తప్ప వెనుకడుగు వేయడం తెలియదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మన ఉక్కు పరిశ్రమను కాపాడుకుందాం.. విశాఖ ఉక్కు పరిరక్షణకు అంతా నడుం బిగించాలి అని ఆయన పిలుపునిచ్చారు. 
అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీ వెళ్దాం 
సీఎం జగన్ ఉత్తరాలు రాశారు.. ఉత్తరాల వల్ల ప్రైవేటీకరణ ఆగలేదు.. జనసేన మొదటి రోజు నుంచి అండగా నిలబడిందని, ఉక్కు పరిరక్షణ సమితికి మద్దతిచ్చామని పవన్ కళ్యాణ్ తెలిపారు. జగన్ నిజాయితీగా పోరాడాలి. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు వున్నా మీరెందుకు పోరాడడం లేదు..? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీ వెళ్దాం.. మన పోరాటం మనం చేయకుండా కేంద్రాన్ని అనడం నాకిష్టం లేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. నాకున్న ఒక్క ఎమ్మెల్యేను వైసీపీ వాళ్లు పట్టుకుపోయారు.. చట్ట సభల్లో నేను బలహీనుడ్ని.. అందుకే అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలతో మాట్లాడండి.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వారం రోజుల్లోగా అఖిలపక్షాన్ని పిలవాలి.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైసీపీ నాయకులు ఏం చేస్తారో స్పష్టం చేయాలి. లేకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు.