బిల్కిస్ బానో దోషుల విడుదలపై ప్రతిపక్షాల ఆగ్రహం

బిల్కిస్ బానో దోషుల విడుదలపై ప్రతిపక్షాల ఆగ్రహం

అహ్మదాబాద్: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మందిని విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్ తో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట మహిళలకు ఇస్తున్న గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నాయి.  క్షమాభిక్ష ద్వారా రేపిస్టులను విడుదల చేసిన ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌... మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి.

ఇదిలా ఉంటే అత్యాచార దోషుల పట్ల ఎలా వ్యవహరించాలనే విషయంలో అటు కేంద్రం, ఇటు గుజరాత్ ప్రభుత్వాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే విషయాన్ని తాజా ఉదంతాన్ని బట్టి అర్థమవుతోంది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల విడుదల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ, అత్యాచార దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయకూడదని అందులో స్పష్టంగా పేర్కొంది.

టెక్నికల్ గా చూస్తే బిల్కిస్ బానో కేసుకు కేంద్ర మార్గదర్శకాలు వర్తించవు. నిండు గర్భిణీపై అత్యాచారం, హత్యకు కుట్ర పన్నిన 11 మంది విడుదల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ ప్రభుత్వం సొంత విధానాన్ని అనుసరించింది. కానీ, గుజరాత్ నిర్ణయం మాత్రం కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. హోం శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న మార్గదర్శకాల్లోని నాలుగో పేజీలో ఉన్న ఐదో పాయింట్‌ను ప్రస్తావిస్తున్నాయి. యావజ్జీవిత శిక్ష విధించిన ఖైదీలను విడుదల చేయరాదని ఈ నిబంధన చెబుతోందని, అలాంటప్పుడు బిల్కిస్ బానో కేసులో జీవిత ఖైదు పడిన 11 మంది దోషులు ఎలా విడుదల చేశారని ప్రశ్నిస్తున్నారు.

ఫిబ్రవరి 27, 2002న సబర్మతి ఎక్స్‌ప్రెస్ కోచ్‌ని తగలబెట్టిన ఘటనలో 59 మంది 'కరసేవకులు' మృతి చెందారు. ఆ తరువాత హింస చెలరేగడంతో.. ఐదు నెలల గర్భిణి అయిన బిల్కిస్ బానో కూతురుతో పాటు మరో 15 మందితో కలిసి గ్రామం నుంచి పారిపోయింది. మార్చి 3న, వారు పొలంలో దాక్కుని ఉండగా... కొడవళ్లు, కత్తులు, కర్రలతో వచ్చిన  30 మంది దుండగులు వారిపై దాడి చేసింది. అందులో 11 మంది బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేయడంతో పాటు ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేశారు.