మూడు నెలలిచ్చి.. బందుపెట్టిన్రు!

మూడు నెలలిచ్చి.. బందుపెట్టిన్రు!

ప్రైవేట్​ టీచర్లకు సాయం ఆపేసిన సర్కారు

హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ స్కూల్ టీచర్లకు సర్కారు సాయం మూడు నెలలకే ముగిసిపోయింది. స్కూళ్లు తెరిచేదాక 25 కిలోల బియ్యం, రూ.2 వేలు ఇస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ మాటిచ్చి నిలుపుకోలేకపోయారు. ఈ నెల ఫస్టు నుంచి స్టూడెంట్లకు ఆన్​లైన్, డిజిటల్ పాఠాలు ప్రారంభం కావడంతో సాయం ఆపేసినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే  ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు సగం మంది టీచర్లతోనే ఆన్​లైన్ క్లాసులు చెప్పిస్తున్నాయి. వాళ్లకు కూడా సగం కంటే తక్కువ జీతాలే ఇస్తున్నాయి. మిగిలిన టీచర్లు పనిలేక, జీతం రాక ఇబ్బంది పడుతున్నారు. కరోనా కారణంగా ఫిజికల్ క్లాసులు ప్రారంభం కాకపోవడంతో గత ఏడాది ప్రైవేట్​ స్కూల్ మేనేజ్​మెంట్లు చాలామంది టీచర్లను విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై పదుల సంఖ్యలో టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమను ఆదుకోవాలంటూ టీచర్లు ఆందోళనలకు దిగారు. దీంతో   స్కూళ్లు తెరిచేదాక ప్రతినెలా రూ.2 వేలు, 25 కిలోల సన్నబియ్యం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్, మే, జూన్ నెలలు ఈ సాయం అందించారు. అయితే జూన్ నెల నగదు  జులై ఫస్ట్ వీక్​లో టీచర్ల అకౌంట్లలో పడింది. ఈ నెల ఫస్ట్ నుంచి ఆన్​లైన్ క్లాసులకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీంతో సాయం వస్తుందో లేదోననే అనుమానం టీచర్లలో మొదలైంది. వాళ్లు ఊహించినట్టే సర్కారు సాయం నిలిపివేసినట్టు స్పష్టమవుతోంది. 
బియ్యం కోసం ప్రపోజల్స్​ పంపలె..
రాష్ట్రవ్యాప్తంగా11,046  ప్రైవేట్​ స్కూళ్లలో 2,04,743 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి సాయం కోసం ప్రతి నెలా 15 తేదీలోపే బియ్యం, నగదుకు ఇటు సర్కారుకు, అటు సివిల్ సప్లై డిపార్ట్​మెంట్​కు స్కూల్ ఎడ్యుకేషన్​నుంచి ప్రపోజల్స్ వెళ్లేవి. కానీ జులైకి సంబంధించిన ప్రపోజల్స్​ పంపలేదు. సర్కారు నుంచి ఆదేశాలు రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రతి నెలా 20వ తేదీ నుంచి టీచర్లకు బియ్యం పంపిణీ జరిగేది. కానీ ఈ సారి బియ్యం కోసం వెళ్లిన టీచర్లకు నిరాశే ఎదురైంది. మీకు ఈ నెల బియ్యం రాలేదంటూ డీలర్లు వెనక్కి పంపిస్తున్నారు. టీచర్లకు జులై నెల బియ్యం పంపిణీపై తమకు ఆదేశాలు రాలేదని సివిల్ సప్లై అధికారి ఒకరు చెప్పారు. 

లక్ష మంది టీచర్లకు ఉపాధి కరువైంది
ఈ నెల ఫస్టు నుంచి ఆన్​లైన్, డిజిటల్ క్లాసులు ప్రారంభమైనా, ప్రైవేట్​ స్కూళ్ల యాజమాన్యాలు టీచర్లందరినీ డ్యూటీల్లోకి తీసుకోలేదు. చాలా స్కూళ్లు కేవలం సగం మంది టీచర్లతోనే నడుస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా టీచర్లకు పూర్తిగా ఉపాధి కరువైంది. సీఎం కేసీఆర్ హామీ మేరకు ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యేదాక సర్కారు సాయాన్ని కొనసాగించాలని ప్రైవేట్​టీచర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.