- త్వరలో అమల్లోకి తెస్తామని మంత్రి గడ్కరీ ప్రకటన
న్యూఢిల్లీ: రోడ్లపై ప్రమాదాలను తగ్గించేందుకు త్వరలోనే వెహికల్ టు వెహికల్ (వీ2వీ) కమ్యూనికేషన్ టెక్నాలజీని అమల్లోకి తెస్తామని కేంద్ర హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ సిస్టమ్‌తో కార్లు ఒకదానితో ఒకటి నేరుగా కమ్యూనికేట్ అయ్యి డ్రైవర్లకు ఆటోమేటిక్ హెచ్చరికలు ఇస్తాయన్నారు. ‘‘మొబైల్ లేదా ఇంటర్నెట్ అవసరం లేకుండా సేఫ్టీ అలర్ట్స్ మార్పిడి జరుగుతుంది.
ముందూ, వెనుకా, పక్కలా, రోడ్డు వంకరలు, భూభాగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని డ్రైవర్‌కు కనిపించని ప్రమాదాలపై కూడా హెచ్చరికలు అందిస్తాయి. ఇది అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) వ్యవస్థలతో కలిపి మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది”అని వివరించారు.
ఈ టెక్నాలజీని ఏర్పాటు చేయడానికి ప్రతి వాహనానికి రూ.5–7 వేల ఖర్చు అవుతుంది. కొత్త వాహనాల్లో తప్పనిసరి చేసి, పాత వాటిలో రిట్రోఫిట్ చేస్తారు. టెలికాం శాఖ ఉచిత స్పెక్ట్రమ్ అందిస్తుంది. ఈ ఏడాదిలోనే పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
