- ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ
- మూడో విడత పోలింగ్ సరళిని పర్యవేక్షించిన జిల్లా ఉన్నతాధికారులు
- ఖమ్మం జిల్లాలో 88.84 శాతం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 84.67 శాతం పోలింగ్ నమోదు
ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం జరిగిన మూడో విడతలో ఖమ్మం జిల్లాలో 88.84 శాతం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 84.67 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పలు సూచనలు చేశారు.
మూడో విడత ముగిసిందిలా...
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో 168 గ్రామ పంచాయతీలకు, 1,372 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఏడు మండలాల్లో మొత్తం 191 గ్రామ పంచాయతీలు, 1,742 వార్డులకు గాను, ఒక సర్పంచ్, 9 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 22 గ్రామ పంచాయతీలు, 361 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యాయి. మొత్తం 2,43,983 మంది ఓటర్లకు గాను, 2,16,765 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటి, రెండో విడత కంటే ఈ సారి పోలింగ్ శాతం కొంత తగ్గింది. ఈనెల 11న జరిగిన మొదటి విడతలో 90.08 శాతం, ఈనెల 14న జరిగిన రెండో విడతలో 91.21 శాతం పోలింగ్ నమోదు అయింది.
ఉదయం 9 గంటల వరకు 27.45 శాతం, 11 గంటలకు 60.84 శాతం, 1 గంట వరకు 86.65 శాతం పోలింగ్ నమోదైంది. ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు టోకెన్ అందించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. వారితో కలిపి మొత్తం జిల్లాలో మూడవ విడత 88.84 శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తల్లాడ మండలం పినపాక జడ్పీహెచ్ఎస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, పోలింగ్ సరళిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తర్వాత కలెక్టరేట్ లోని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షణ చేశారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఏడు మండలాల్లో 155 పంచాయతీలకు గానూ రెండు చోట్ల ఎన్నికలు జరుగలేదు. ఎనిమిది పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 145 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 1,330 వార్డులకు గానూ మూడు వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 256 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 1,071 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 1,75,074 మంది ఓటర్లకు గానూ 1,48,230 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి విడతలో 71.79శాతం, రెండో విడతలో 82.91శాతం నమోదు కాగా మూడో విడతలో 84.67శాతం పోలింగ్ నమోదైంది.
మొదటి విడత కన్నా రెండో విడత, రెండో విడత కన్నా మూడో విడతలో పోలింగ్ పెరిగింది. సుజాతనగర్ మండలంలో అత్యధికంగా 89.32శాతం పోలింగ్ నమోదు అయింది. ఉదయం 9 గంటలకు 21.27శాతం నమోదు కాగా 11 గంటల వరకు 62.35శాతం నమోదైంది. టేకులపల్లి మండలంలోని అనిశెట్టిపల్లి గ్రామంలోని పోలింగ్కేంద్రంతో పాటు పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ , సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ బి. రోహిత్ రాజు పరిశీలించారు. కలెక్టరేట్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.
