సింఘు బార్డ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

సింఘు బార్డ్  కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

సింఘు బార్డ్ వద్ద వ్యక్తి హత్య కేసులో ముగ్గురు నిందితులను హర్యానా సోనిపట్ కోర్టులో హాజరుపర్చారు. అక్టోబర్ 15న సింఘు బార్డర్ దగ్గర వ్యక్తిని దారుణంగా హత్య చేసి బారికేడ్లకు కట్టేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు నారాయణ్ సింగ్, భగవంత్ సింగ్, గోవింత్ ప్రీత్ సింగ్‌‌లను ఆరు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. సోనిపట్ కోర్టు ముందు నిందితులను ఆదివారంనాడు హాజరుపరిచారు. హత్యకు గురైన లఖ్‌బీర్ సింగ్ మృతదేహానికి పంజాబ్‌లోని ఆయన స్వగ్రామంలో భారీ బందోబస్తు మధ్య కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు, సిక్కు మత ప్రార్థనలకు సిక్కు పూజారులు కానీ, ఆయన స్వగ్రామానికి చెందిన వారు హాజరుకాలేదు. లఖ్‌బీర్ సింగ్ దారుణ హత్యలో మొదటి నిందితుడైన సరబ్‌జిత్ సింగ్‌‌ను శుక్రవారం అరెస్టు చేసి హర్యానాలోని సోనిపట్ కోర్టు ముందు హాజరు పరచగా, అతనికి 7 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించారు.

అతని అరెస్టు తర్వాత కొద్ది గటంలకు నారాయణ్ సింగ్ (నిహాంగ్)ను అమృత్‌సర్ రూరల్ పోలీసులులు అమృత్‌సర్ జిల్లా అమర్కోట్ గ్రామంలో అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం మరో ఇద్దరు సోనిపట్ పోలీసుల ముందు లొంగిపోయారు. దీంతో లఖ్‌బీర్ సింగ్ హత్యా ఘటనలో అరెస్టయిన వారి సంఖ్య నలుగురికి చేరింది. పవిత్ర గ్రంథాన్ని అపవిత్రం చేసినందుకు శిక్షించామని, ఇందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని శుక్రవారం పోలీసులకు లొంగిపోయే ముందు నారాయణ్ సింగ్ మీడియాకు తెలిపారు. అరెస్టుకు ముందు ఆయన అమర్‌కోట్ గురుద్వారా వద్ద ప్రార్థన చేస్తుండగా కొందరు ఆయనకు గౌరవ చిహ్నంగా కరెన్సీ నోట్ల దండ వేశారు.