శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. ఎప్పుడంటే

శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. ఎప్పుడంటే

తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 19వ తేదీ ఆదివారం  పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ రోజు సాయంత్రం (నవంబరు 18న) 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ చేశారు.

పుష్పయాగం రోజున ( నవంబర్ 19)  ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది.

 కలియుగ దైవం..అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు. తిరుమల ఏడుకొండలపై కొలువైన శ్రీ వేంకటేశ్వరుడు అలంకార ప్రియుడు. రకరకాల పుష్పాలతో అలకరంచే శ్రీవారిని కనులారా చూడటానికి రెండు కళ్లూ చాలవు. పువ్వులతోనే కాదు రకరకాల నగలతో అలకరించే వెంకన్నను దర్శించుకోవాటానికి భక్తులు భారీగా తరలివస్తారు. శ్రీవారికి జరిగే రకరకాల సేవల్లో పాల్గొనటానికి భక్తులు ఆశపడుతుంటారు. అటువంటి సేవల్లో అత్యంత రమణీమైనది పుష్పయాగం. అటువంటి పుష్పయాగాన్ని చూడాలంటే అదృష్టం ఉండాల్సిందే.

 ఈ పుష్పాలతో వేద పురాణ ప్రబంధ పారాయణం జరుపుతూ.. తులసీదళాలతో వివిధ రకాల పుష్పాలను స్వామివారి పాదాలకు సమర్పిస్తారు. ఈ పుష్ప యాగం నిర్వహించడం వలన బ్రహ్మోత్సవంలో తెలిసీ తెలియక ఏమైనా దోషాలు జరిగితే.. ఆ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అంతేకాదు పుష్పయాగాన్ని దర్శించిన వారికీ ఉత్తమ గతులు లభిస్తాయని విశ్వాసం.

పుష్పయాగానికి ఉపయోగించే పువ్వుల రకాలు..

సంపంగి, కనకాంబరం, లిల్లీ, తామరపువ్వులు, విరజాజి, మరువం, దవనం, మల్లి, జాజి, రక రకాల గులాబీలు, చామంతి, కదిరిపచ్చ, బిల్వ, కనకాంబరం, కమలం, మొగలి వంటి అగ్రకర్ణికా, కాలనందా అనేవి మొత్తం ఇరవై ఏడు రకాలు పువ్వులతో వెంకటేశ్వరస్వామికి పుష్పకైంకర్యం చేస్తారు. ఈ పుష్పయాగం కోసం తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకకు చెందిన దాతలు పుష్పాలను పంపుతారు. పరిమళాలు విరజల్లే పవ్వులంటే స్వామికి అత్యంత ప్రీతి. అందుకే స్వామివారి సేవలో రంగు రంగులతో కనువిందు చేసే సుగంధ పరిమళాలు విరజల్లే పువ్వులు వినియోగిస్తారు.