నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం

నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం

సకాలంలో వానలు పడి, పంటలు పండాలంటే అడవులు బాగుండాలె. అడవులు బాగుండాలంటే అందులోని జంతుజాలం, జీవ వైవిధ్యం సమతూకంలో కొనసాగాలె. ఇందుకోసం అడవుల్లో పెద్ద పులులు ఉండాలె. ఎందుకంటే.. అడవికి పెద్దన్నలు పెద్దపులులే! అడవుల్లో జీవ వైవిధ్యానికి పెద్దపులులే కీలకం కాబట్టి.. పెద్దపులులను రక్షించుకోవాల్సిన అవసరాన్ని చాటిచెప్తూ 2010 నుంచి ఏటా జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుకొంటున్నాం. 

రాష్ట్రంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పులుల సంఖ్య పెరుగుతున్నది. దేశంలోనే పెద్దపులుల మనుగడకు అత్యంత అనుకూల వాతావరణం ఉన్న అమ్రాబాద్ రిజర్వ్ లో మూడేండ్ల క్రితం సుమారు 18 వరకూ పెద్ద పులులు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 23కు పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో నాగార్జునసాగర్‌‌, శ్రీశైలం టైగర్‌‌ రిజర్వు ఫారెస్టు ఐదు జిల్లాల్లో విస్తరించి ఉండేది. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో మూడు జిల్లాలకు, తెలంగాణలో నాగర్ కర్నూల్, నల్గొండ రెండు జిల్లాలకు పరిమితమైంది. విభజన తర్వాత అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్‌‌) దేశంలోనే అతిపెద్ద రిజర్వ్ ఫారెస్టులలో ఆరోదిగా నిలిచింది. నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల పరిధిలో 2,611.39 చదరపు కిలోమీటర్ల పరధిలో ఏటీఆర్‌‌ విస్తరించి ఉంది. గతంలో ఇక్కడ పులుల సంతానోత్పత్తి దేశంలోనే అత్యధికంగా ఉండేది. సహజంగా పెద్దపులి వేట కోసం 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో సంచరిస్తుంది. కానీ నల్లమల కొండల నడుమ విస్తరించి ఉన్న అమ్రాబాద్ రిజర్వులో కేవలం 70  చదరపు కిలోమీటర్లలోపే వాటికి ఆహారం దొరుకుతోంది. ఇక్కడి వాతావరణం, ఏరియా విస్తీర్ణం, పెరుగుతున్న శాకాహార జంతువుల కారణంగా ఇక్కడ100 టైగర్ల వరకు నివసించేందుకు చాన్స్ ఉంది. 
బాణంలా దూసుకెళ్తది 
పాంథెరా జాతికి చెందిన పెద్ద పులి (పాంథెరా టైగ్రిస్)ను మన దేశం జాతీయ జంతువుగా ఎంచుకున్నది. 1972 నవంబరు18న పెద్దపులిని జాతీయ జంతువుగా కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. గ్రీకు పదం టైగర్ నుంచి టైగ్రిస్ అన్న పదం పుట్టింది. దీనికి పర్షియా భాషలో బాణం అని అర్థం. బాణంలా వేగంగా దూసుకెళ్లే కెపాసిటీ ఉన్నందున పెద్దపులికి టైగ్రిస్ అనే పేరు వచ్చింది. పాంథెరా అంటే పసుపు, తెలుపు రంగు గల ఆసియా మూలాలున్న జంతు జాతి. ఒకప్పుడు ఆసియాలోని కాకసస్‌‌ నుంచి కాస్పియస్‌‌ సముద్రం, సైబీరియా, ఇండోనేషియా దేశాల వరకు పులులు విస్తరించాయి. కాలక్రమంలో పశ్చిమ ఆసియా నుంచి పులులు పూర్తిగా కనుమరుగయ్యాయి. పశ్చిమ భారతదేశం నుంచి తూర్పున చైనా, అగ్నేయాసియా వరకు, పడమర ఆగ్నేయ సైబీరియాలోని అముర్‌‌ నది వరకు పెద్దపులుల మూలాలు విస్తరించాయి. నవంబరు నుంచి ఏప్రిల్‌‌ మధ్య పెద్దపులులకు సంతానోత్పత్తి కాలం. ఆడ పులి కలయికకు కొన్ని రోజులు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. పిల్లుల మాదిరిగా శబ్దం చేస్తూ.. తరచూ జతకూడతాయి. గర్భధారణ సమయం16 వారాలు. ఆడ పులి ఒక ఈతలో  కిలో బరువు ఉండే రెండు, మూడు కూనలకు జన్మనిస్తుంది. దట్టమైన ప్రాంతాలు, రాతి పగుళ్లలో వాటిని దాచి, ఆడ పులులు వేటకు వెళ్తాయి. పులి కూనల సంరక్షణను పూర్తిగా ఆడ పులులే చూసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో వాటితో సంబంధం లేని మగ పులులు, ఆడ పులులతో జతకూడటం కోసం పులికూనలను చంపేస్తాయి. మరణాల రేటు పులులలో చాలా అధికం. సగం కంటే ఎక్కువ పులులు రెండేండ్ల కంటే ఎక్కువగా బతకలేవు.   
పులి ఉంటేనే.. అడవి బాగుంటది 
అడవిలో రకరకాల మొక్కలు, గడ్డి జాతులపై ఆధారపడి శాకాహార జంతువులు ఉంటాయి. వీటిపై ఆధారపడి పులులు జీవిస్తాయి. శాకాహార జంతువుల వల్ల మొక్కలు, గడ్డిజాతుల మధ్య బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అలాగే పులుల వల్ల శాకాహార జంతువుల సంఖ్య బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. దీనివల్ల పెద్దపులులు ఉన్న ప్రాంతంలో అడవి అన్నిరకాలుగా జీవ వైవిధ్యంతో పచ్చగా ఉంటుంది. పెద్దపులులతో కళకళలాడే అడవులు వాతావరణ మార్పులను నివారించి, సకాలంలో వర్షాలు కురిసేందుకు, మనకు కావాల్సినంత ఆక్సిజన్ అందించేందుకు సహాయపడతాయి. అందుకే పెద్దపులుల సంరక్షణకు అటవీ శాఖ ఆఫీసర్లు, పర్యావరణవేత్తలు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు.  
టైగర్ రక్షణకు ప్రత్యేక చర్యలు 
పెద్దపులులతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కూడా అడవుల పరిరక్షణలో భాగమే. వన్యప్రాణుల రక్షణ కోసం ఇప్పటికే అమ్రాబాద్ రిజర్వ్ లో 170 మంది లోకల్ యువతకు ఉద్యోగాలు కల్పించారు. రిజర్వ్ లోని టూరిస్ట్ ప్రాంతాల్లో టూరిస్టులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. వారికి జీవ వైవిధ్యం, అడవుల రక్షణ, వన్యప్రాణుల ప్రాధాన్యతను వివరిస్తున్నారు. ప్రధానంగా పులుల సంరక్షణపై ఏజెన్సీ ఏరియాల్లో అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అమ్రాబాద్ రిజర్వ్ కు పక్కనే ఉన్న శ్రీశైలం టైగర్ రిజర్వ్ నుంచి పులులు వస్తూ, పోతూ ఉంటాయి. కృష్ణా తీరం వెంట వీటి సంరక్షణపై నిరంతరం పర్యవేక్షణకు మూడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి బోట్ పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. టైగర్ రిజర్వు అభివృద్దికి www.amrabadtigerreserve.com పేరుతో ప్రత్యేక వెబ్ పోర్టల్ ను కూడా ప్రారంభించారు. ఈ వెబ్ పోర్టల్ ద్వారా అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలు, జీవవైవిధ్యం, రీసెర్చ్, పర్యాటక టూరిజం డెవలప్​మెంట్​ బుకింగ్, ప్రొటెక్షన్ తదితర అంశాలను నిరంతరం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.                                                                                                                                                                                  - కొర్రపాటి సైదులు, జర్నలిస్టు

ప్రజలు సహకరిస్తేనే అడవుల అభివృద్ధి 
రాష్ట్రంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయిన అమ్రాబాద్ రిజర్వ్ ను కాపాడుకోవడం స్థానిక ప్రజల బాధ్యత. స్థానికులు ఫారెస్ట్ ఆఫీసర్లకు సహకరించి, అడవుల నరికివేత, ఆక్రమణలు, వేట వంటివి ఆపాలి. పశువులను మేతకు తీసుకెళ్లడంలో జాగ్రత్తలు పాటించాలి. అధికారులు సూచించిన ప్రాంతంలోనే పశువులను మేపుకోవాలి. ఫారెస్ట్ అధికారులతో కలిసి పనిచేసే స్థానిక యువతకు ప్రత్యేక గుర్తింపు కల్పించేలా చూస్తాం. అడవి అభివృద్ధి చెందితేనే స్థానికులకు అడవి ఉత్పత్తులు పెరిగి ఉపాధి దొరుకుతుంది. టూరిజంను మరింత అభివృద్ధి చేస్తాం. వన్యప్రాణుల రీహ్యాబిలిటేషన్ సెంటర్ ను, కాలుష్య నివారణకు రీసైక్లింగ్ ప్లాంటునూ ఏర్పాటు చేసి మరింత మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం.                            - రోహిత్ గోపిడి, డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్