ఇండియాలో తొలి మహిళా టీచర్‌‌‌‌‌‌‌‌ సావిత్రి బాయి

ఇండియాలో తొలి మహిళా టీచర్‌‌‌‌‌‌‌‌ సావిత్రి బాయి
  • ఇయ్యాల సావిత్రిబాయి పూలే పుట్టిన రోజు

గురిచూసి రాయి విసిరితే చెట్టుకున్న కాయ రాలి పడాల్సిందే.. అంతటి కాన్​సన్ట్రేషన్. ఈత కొట్టుడు వెన్నతో పెట్టిన విద్య..అబద్ధాలు ఆడటం చేతకాదు.. ఒకరిని గేలి చేయడం, వేధించడం అస్సలు రాదు..ఆరేండ్ల వయసు నుంచే చేనుకెళ్లడం  ఆమె అలవాటు.. బర్రెలు కాయడం.. పాలు తీయడం ఆమెకు చిన్న వయసు నుంచే అబ్బింది. ఇయన్నీ ఆమె స్కిల్స్‌‌‌‌ అయితే.. ఇండియాలో తొలి మహిళా టీచర్‌‌‌‌‌‌‌‌ సావిత్రి బాయి.  స్త్రీల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసి అభ్యుదయ వాదిగా ఎంతో పేరు సంపాదించింది. ఆమె బాటలో ఎందరో నడిచారు.. ఉన్నతంగా ఎదిగారు..అయినప్పటికీ నేటికీ ఆమె కృషికి, త్యాగానికి తగిన గౌరవం దక్కలేదనే చెప్పొచ్చు. 

బహుజన సమాజంలోని  పురుషులు కూడా చదువు నేర్చుకో కూడదని బ్రాహ్మణ వాద మత గ్రంధాలు శాసించిన రోజులవి. ఇక స్త్రీల దుస్థితి గురించి వేరే చెప్పనవసరం లేదు. అసలు ధర్మశాస్త్రాల్లోని సారాంశాన్ని వదిలి  దళిత, బహుజన స్త్రీలే కాదు  బ్రాహ్మణ వర్గానికి చెందిన స్త్రీలు కూడా చదువుకోడానికి వీల్లేదని అడ్డు పెట్టారు. ఆ సమయంలో మహిళల పాలిట వేగుచుక్కలా పుట్టుకొచ్చింది సావిత్రిబాయి. 1831, జనవరి 3న మహారాష్ట్ర, సతారా జిల్లా నాయగావ్‌‌‌‌లో లక్ష్మీబాయి, ఖండోజీ దంపతులకు సావిత్రి జన్మించింది. పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది అన్న చందాన సావిత్రికి పుట్టుకతోనే ఎన్నో మంచి లక్షణాలు అలవడ్డాయి. చక్కని రూపు రేఖలతో ఉండే సావిత్రిబాయి చిన్నతనం నుంచి ఆమె మాట తీరు ఆకట్టుకునే విధంగా ఉండేది. చురుగ్గా, చలాకీగా ఉంటూ తన పనులతో తెలివైన బాలిక అనిపించుకుంది.
జీవితంలో మలుపు..
 1818 సంవత్సరం జనవరి 1న మహారాష్ట్రలో బ్రాహ్మణ మనువాద రాజ్యాన్ని పాలించిన పీష్వా  మరణించాడు. దేశవ్యాప్తంగా ఆంగ్లేయుల ఆధిపత్యం పెరిగిపోయింది. మహారాష్ట్ర కూడా ఆంగ్లేయుల బానిసత్వంలోకి వెళ్లిపోయింది. ఆంగ్లేయులు బ్రాహ్మణీయ విద్యావిధానానికి తిలోదకాలిచ్చి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. క్రమేణా బ్రిటిష్ వారి విద్యాబోధనకు  ప్రాధాన్యత పెరిగింది. బహుజన సమాజం మరాఠీ భాషలో ఓనమాలు కూడా దిద్ద లేని అంధకార యుగమది. నిరక్షరాస్యతతోపాటు, అజ్ఞానం మూఢనమ్మకాలు బహుజన సమాజాన్ని చిత్రహింసలు పెడుతున్నాయి. అటువంటి సమయంలో సావిత్రి జీవితంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. ఒకరోజు ఆమె బజారు వెళ్లినప్పుడు అక్కడ ఒక చెట్టు కింద కొంతమంది మిషనరీ క్రైస్తవ స్త్రీలు పురుషులు పాడటం చూసింది. అక్కడున్న వారు ఆమెను చూసి ‘‘అమ్మ నీకు ఒక పుస్తకం ఇస్తాము.. నీకు చదువు రాక పోయినా పర్వాలేదు. ఆ బుక్‌‌‌‌లో బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు చూసి నువ్వు కొంత అర్ధం చేసుకోవచ్చు’’ అని ఆమె ఒక బుక్‌‌‌‌ ఇచ్చారు. దాన్ని ఇంటికి తీసుకొచ్చి తండ్రికి చూపించింది. అది చూసిన ఆమె తండ్రి ‘‘నువ్వు కులాన్ని బ్రష్టు పట్టిస్తున్నావని” తిట్టడమే కాదు బుక్‌‌‌‌ని విసిరేసాడు. కానీ సావిత్రి ఆ పుస్తకాన్ని జాగ్రత్త పెట్టి పెండ్లి అయ్యాక, అత్తారింటికి దాన్ని కూడా తీసుకెళ్లింది. ఆ సంఘటన ఆమె జీవితాన్ని ఓ మలుపు తిప్పింది.    
పెండ్లి.. చదువు..
ఆరేళ్లకు ఆడపిల్లలకు, పదేళ్లకు మగ పిల్లలకు పెళ్లి చేయకపోతే అప్పటి సమాజం వారిని చిన్న చూపు చూసేది. తప్పనిసరి పరిస్థితుల్లో 9 ఏండ్లకే సావిత్రిని 12ఏండ్ల జ్యోతిరావుకు ఇచ్చి పెండ్లి చేశారు.  పెండ్లి అయ్యాక అత్తవారింటికి వెళ్ళేసరికి అక్కడ కేవలం జ్యోతి రావు అతని తండ్రి మాత్రమే ఉండటంతో, చిన్న వయసులోనే కుటుంబ భారం మొత్తం సావిత్రి భుజాల పై పడింది. అప్పటికి జ్యోతిరావు పూలే క్రైస్తవ మిషనరీ స్కూల్‌లో చదువుకుంటున్నారు. ఆయన అలా చదువుకోవడం ధర్మ విరుద్ధమని బ్రాహ్మణ సాంప్రదాయ వాదులు భావించేవారు. పూలే తండ్రిని నిందించేవారు. ఈ విమర్శలు శృతిమించడంతో తట్టుకోలేనతండ్రి అతన్ని బడి మానిపించాడు. 1842లో పూలే తిరిగి స్కూలుకు వెళ్ళారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలు పెట్టారు. ‘సావిత్రి కూడా ఎందుకు చదువుకో కూడదు’ అని పూలే ఆలోచించారు. స్వయంగా తానే సావిత్రికి చదువు నేర్పడం ప్రారంభించారు. భర్తను అనుసరిస్తూ సావిత్రి మెల్లమెల్లగా మరాఠి, ఇంగ్లిష్​ చదవడం, రాయడం నేర్చుకున్నారు. నిరక్షరాస్యులైన సావిత్రి అక్షరాస్యురాలిగా మారడం ఆమె జీవితంలొ గొప్ప మలుపు వచ్చింది.   భావి తరాలకు సరైన మార్గం చూపించగలిగే ఒక ఆదర్శ విప్లవ స్త్రీ మూర్తిగా సావిత్రిబాయి చరిత్రకెక్కేందుకు వేసిన తొలి అడుగు, ఆమె చదువు నేర్చుకోవడం.
నిరాడంబర జీవితం..
సావిత్రి ఎంతో నిరాడంబర జీవితాన్ని కొనసాగించేది. ఖాదీ వస్త్రాలను స్వయంగా స్వయంగా నేసి, కుట్టుకునేది. పెండ్లిండ్లకు, శుభకార్యాలకు కూడా ఆమె ఖాదీ దుస్తులే ధరించి వెళ్ళేవారు. 1920వ సంవత్సరం నుంచే ఇండియాలో ఖాదీ ఉద్యమం ప్రారంభమైందని చాలామంది అపోహలో ఉన్నారు. కానీ, అంతకు ముందే ఖాదీ ధరించి మార్గదర్శనం చేశారు సావిత్రిబాయి పూలే దంపతులు. మహిళల్లో చైతన్యం పెంపొందించేందుకు, అంటరానితనం నిర్మూలన, స్త్రీ సమస్యలు పరిష్కారం కోసం సావిత్రి తొలి మహిళా సేవా మండలి ప్రారంభించారు. ఆమె ఆధ్వర్యంలో జరిగే సభలు, వేడుకలకు వేల సంఖ్యలో బాలికలు హాజరయ్యే వారు. నేటి సమాజపు మహిళలకు సావిత్రిబాయి ఎంతో స్ఫూర్తిగా నిలిచారు.
నిస్వార్థ సేవకు నిదర్శనం..
 సావిత్రికి బ్రాహ్మణ స్నేహితులుండేవారు. సావిత్రిబాయి నిస్వార్థ సేవ వలన కేవలం దళిత సమాజంలోనే కాక మహారాష్ట్ర సమాజంలోనే ఆమె పేరు ప్రఖ్యాతులు పెరిగాయి.  సామాజిక సేవకు సహాయం చేసేందుకు పలువురు ముందుకు వచ్చారు. అదే సమయంలో సావిత్రిబాయిని విమర్శించే వారు అధికంగానే ఉండేవారు. అందరూ అమ్మలక్కల ఇంట్లో కూర్చోకుండా వీధుల్లోకి వచ్చి అంటరానివారికి బాలికలకు విద్య నేర్పించడం సాంప్రదాయ బ్రాహ్మణ వాదులు సహించలేకపోయేవారు. అయినా సావిత్రిబాయి చలించలేదు. ఆమె పట్టుదల అలాంటిది. అన్ని కష్టనష్టాల్లో జ్యోతి రావు పూలే ఆమెకు సపోర్ట్​గా నిలిచేవారు. మహాత్మా పూలే మరణం తర్వాత సావిత్రిబాయి తాము స్థాపించిన సంస్థలన్నింటినీ నడిపే బాధ్యత తీసుకొని సంస్థలంన్నిటినీ అభివృద్ధి పథంలోకి నడిపించారు. 1896లో రాష్ట్రంలో పెద్ద కరువు వచ్చింది. వేలాదిమంది నీరు ఆహారం లేక మరణించారు.

ప్రభుత్వం  ద్వారా రిలీఫ్ వర్క్  జరిగేందుకు సావిత్రి బాయి విశేష కృషి జరిపింది. ఈ అకాల కరువు నుంచి ప్రజలు తేరుకొక ముందే పూణేలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. దీంతో పట్టణాలు, గ్రామాల్లో. రోజుకు వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. నివారణ చర్యలు తీసుకోపోగా ప్రభుత్వం వ్యాధివారిని ఇళ్ల నుంచి తరిమేసేందుకు తెల్ల సిపాయిలు రంగంలోకి దింపింది. వ్యాధి కంటే ఎక్కువగా సైనికుల బాధకు ప్రజలు విలవిలలాడి పోయారు. అలాంటి భయంకర పరిస్థితులలో సావిత్రిబాయి చేపట్టిన సేవా చర్యలను అక్కడి ప్రజలు ఈనాటికీ చెప్పుకుంటారు. విశ్రాంతి లేకుండా సేవ చేయడం వల్ల సావిత్రి ఆనారోగ్యం పాలయ్యారు. ప్లేగు కూడా సోకడంతో1897, మార్చి 10న సావిత్రిబాయి మరణించారు.
తొలి మహిళా టీచర్‌‌‌‌‌‌‌‌గా
1848, జనవరి 1న పూలే బాలికల కోసం ఇండియాలో మొదటి బడిని  ప్రారంభించగా, అందులో సావిత్రి మొదటి మహిళా టీచర్‌‌‌‌‌‌‌‌గా పని చేశారు.‌‌‌‌‌‌‌‌ ఈ బడి స్థాపించేందుకు పూలే ఎన్ని కష్టాలు పడ్డారో టీచర్‌‌‌‌‌‌‌‌గా పాఠాలు చెప్పేందుకు సావిత్రి అంతకంటే ఎక్కువనే కష్టాలు పడ్డారు. ఎంతోమంది ఆమె ఉద్యోగాన్ని మానిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. బాలికల బడి కావడంతో ఇందులో పనిచేసేందుకు పురుషులు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు.  ఆడపిల్లలను బడికి పంపించేందుకు పేరేంట్స్‌‌‌‌ కూడా ఒప్పుకునేవారు కాదు. ఇటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని సావిత్రిబాయి ముందుకు సాగారు. పిల్లలను బడికి తీసుకొచ్చి వారికి చదువు నేర్పడం మొదలుపెట్టారు. చదువే కాకుండా ఆటపాటలు కూడా నేర్పించేవారు. పిల్లలతో ప్రేమగా ఉంటూ వారిలో మానసిక వికాసాన్ని పెంపొందించారు. ఆరోగ్యం సరిగాలేని చిన్నారులను ఆసుపత్రికి కూడా తీసుకెళ్లేవారు. ఇలాంటి సంఘటనలతో సావిత్రి బాయి బహుజనుల మనసు కూడా గెలుచుకోగలిగారు. - కర్రోల్ల రాజు బహుజన్, సోషల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌.