టమాట దిగొస్తున్నది.. రైతు బజార్లలో కిలో రూ.60 నుంచి 70

టమాట దిగొస్తున్నది..  రైతు బజార్లలో కిలో రూ.60 నుంచి 70
  •  
  • గత నెలలో పలు జిల్లాల్లో కిలో రూ.200తో ట‘మోత’
  • మార్కెట్‌‌కు లోకల్​ పంట వస్తుండటంతో తగ్గుతున్న ధరలు
  • ఈ నెలాఖరుకు రూ.50 కన్నా తగ్గుతాయంటున్న వ్యాపారులు

వరంగల్/మహబూబ్​నగర్, వెలుగు: రాష్ట్రంలో టమాట రేట్లు దిగి వస్తున్నాయి. గత నెలలో కిలో రూ.200 నుంచి 240 వరకు పలికి ఆల్​టైం రికార్డు క్రియేట్ చేసిన టమాట ధరలు రెండు, మూడురోజులుగా తగ్గుతున్నాయి. రైతు బజార్లలో కిలో రూ.60 నుంచి 70 పలుకుతుండగా, హైదరాబాద్ సిటీలో ట్రాలీ ఆటోల్లో రూ.80కి కిలో చొప్పున, రూ.150కి రెండు కిలోల చొప్పున అమ్ముతున్నారు. లోకల్ టమాట మార్కెట్‌‌కు వస్తుండడం వల్లే రవాణా భారం తగ్గి, రేట్లు దిగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. 

ఈ నెలాఖరు కల్లా లోకల్‌‌గా మరింత పంట చేతికి వస్తే టమాట రేట్లు కిలో రూ.50 కంటే కిందికి పడిపోతాయని చెప్తున్నారు.

రూ.10 నుంచి పెరుగుతూ పోయింది..

మార్చి, ఏప్రిల్‍ నెలల్లో కిలో టమాట రూ.10కి అటుఇటు ఉంది. మే నెలలో రాష్ట్రంలో అకాల వర్షాలు కురవడంతో ఒక్కసారిగా తోటలు దెబ్బతిన్నాయి. దిగుబడి తగ్గడంతో మే రెండోవారం నుంచి ధరలు పెరిగాయి. జూన్‍ మొదటి వారంలో కిలో రూ.20 చొప్పున అమ్మారు. 20వ తేదీనాటికి కిలో రూ.40కి, వారం గడిచాక ఒక్కసారిగా రూ.100 దాటింది. ఆ తర్వాత టమాట కొనలేక సామాన్యులు విలవిల్లాడారు. ఒక దశలో లోకల్ టమాట పూర్తిగా బంద్​కావడంతో వ్యాపారులు పక్క రాష్ట్రాలైన ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకున్నారు. రవాణా భారం కావడం, ప్రభుత్వం కంట్రోల్​చేయపోవడంతో రేట్లను ఎడా పెడా పెంచేశారు. పలు మార్కెట్లలో వ్యాపారులు సిండికేట్‌‌గా మారి, టమాటను బ్లాక్​చేసి ఎక్కువ రేట్లకు అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా బ్లాక్ చేసిన టమాటలు మురిగిపోవడంతో వరంగల్​లాంటి చోట్ల రోడ్లపై పారబోసిన ఘటనలు జరిగాయి. మొత్తం మీద జులై 15 కల్లా కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, మహబూబ్​నగర్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, నిర్మల్ లాంటి జిల్లాల్లోనూ కిలో టమాట డబుల్ సెంచరీ దాటింది. ములుగు జిల్లాలో పలు చోట్ల కిలో టమాటా రూ.240 దాకా పలకడం గమనార్హం.

లోకల్ పంట రాకతో..

రాష్ట్రవ్యాప్తంగా వానకాలం పంటలు చేతికి వస్తుండడంతో టమాట రేట్లు దిగివస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్​నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రైతులు హైదరాబాద్‌‌లోని రైతు బజార్లకు పెద్ద ఎత్తున టమాట తీసుకువస్తున్నారు. టమాటలను ఇప్పుడు రోడ్ల పక్కన ఆటో ట్రాలీల్లో పోసుకొని కిలోకు రూ.80 చొప్పున అమ్ముతున్నారు. పది రోజుల కింద వరంగల్ సిటీలోని హోల్‍సేల్‍ మార్కెట్లకు సగటున డెయిలీ 850 క్వింటాళ్ల టమాట రాగా, సోమవారం ఏకంగా 2,450 క్వింటాళ్ల స్టాక్‍ వచ్చింది. దీంతో రైతు బజార్లలో రూ.60 నుంచి రూ.70 చొప్పున విక్రయించారు. రోడ్ల మీద ఆటోల్లో రూ.80 చొప్పున అమ్మారు. మంగళవారం పాలమూరు మార్కెట్‌‌లో టమాట బాక్సు (20 కిలోలు) హోల్​సేల్ ధర రూ.1,500 నుంచి రూ.1,700 పలికాయి. దీంతో కిలో రూ.70 నుంచి రూ.80 చొప్పున విక్రయించారు. నాగర్​కర్నూల్ జిల్లాలోనూ ఇవే రేట్లు ఉన్నాయి. జగిత్యాల, గద్వాల, జనగామ, మహబూబాబాద్, మెదక్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, భదాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో హోల్​సేల్ బాక్సు ధర రూ.1,700 నుంచి రూ.1,800 పలుకగా కిలో రూ.90 నుంచి రూ.100 దాకా విక్రయించారు. మిగిలిన జిల్లాల్లోనూ పది అటూ ఇటుగా కిలోకురూ.100 లోపే పలికాయి.

సామాన్యులకు రిలీఫ్‍

టమాట రేట్లు తగ్గడం సామాన్యులకు కొంత రిలీఫ్. 40 ఏండ్లలో ఎన్నడులేని విధంగా ఈసారి టమాట, పచ్చిమిర్చి రేట్లు పెరిగాయి. వారం కింది వరకు టమాట, పచ్చి మిర్చి కిలో రూ.200 చెప్పారు. ఇప్పుడు రూ.100లోపే ఉండడం కొంత బెటర్‍ అనిపిస్తోంది. జూన్‍, జులైలో టమాట వాడకం చాలావరకు తగ్గించాం. ఇప్పుడు ఎంతోకొంత కొనుక్కోవచ్చనిపిస్తున్నది.
-ఎం.పవన్‍, రాంనగర్‍, హనుమకొండ

నెలాఖరుకల్లా కిలో రూ.20కి తగ్గుతది

వర్షాలు పడితే టమాట తోటలు పోతయి. పండ్లు కూడా పగిలిపోతయి. దిగుబడి ఉండదు. జూన్, జులైలో సహజంగానే టమాట సాగు తగ్గుతది. దీంతో డిమాండ్‌‌కు తగ్గ పండ్లు లేక ఆగస్టు వరకు రేట్లు పెరుగుతాయి. కానీ ఈసారి అంచనాలకు మించి టమాట రేట్లు పెరిగాయి. పక్క రాష్ట్రాల నుంచి తెప్పించడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం లోకల్ టమాట మార్కెట్లకు వస్తోంది. ఈ నెలాఖరుకల్లా కిలో టమాట రూ.20కి చేరుతుంది.
- కేశవర్ధన్​గౌడ్, ఈవో, రైతు బజార్