ప్రపంచంలోనే 2వఎత్తైన మకావు టవర్ నుంచి బంగీ జంప్.. ఊపిరాడక టూరిస్ట్ మృతి

ప్రపంచంలోనే 2వఎత్తైన మకావు టవర్ నుంచి బంగీ జంప్.. ఊపిరాడక టూరిస్ట్ మృతి

56 ఏళ్ల జపనీస్ వ్యక్తి చైనాలోని మకావు టవర్ నుంచి బంగీ జంపింగ్ చేసి, మరణించాడు. ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన బంగీ జంప్‌గా పేరు పొందింది. స్థానిక కాలమానం ప్రకారం డిసెంబర్ 3న సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో 764 అడుగుల జంప్‌ను పూర్తి చేసిన తర్వాత ఆ వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడని హాంకాంగ్ ఆధారిత వార్తా సైట్ HK01 నివేదించింది. మెడికల్ సిబ్బంది వచ్చే సమయానికి, అతని శ్వాస పూర్తిగా ఆగిపోయింది. గుండె చప్పుడు కూడా లేదు. అనంతరం అతన్ని కొండే S.జానుయారియో ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు రోగిని కాపాడలేకపోయారు. ఆ తర్వాత ఆ వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించారు. కానీ పర్యాటకుడి మరణానికి గల ఖచ్చితమైన కారణం మాత్రం ఇప్పటికీ అధికారిక సమాచారం ఇవ్వలేదు.

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, బంగీ జంపింగ్ కు ముందు, కస్టమర్లు అధిక రక్తపోటు, మధుమేహం, మూర్ఛ లేదా మునుపటి శస్త్రచికిత్సలు వంటి వైద్య పరిస్థితులతో బాధపడుతుంటే సిబ్బందికి తెలియజేయాలి. బంగీ జంపింగ్ వల్ల కలిగే నష్టాల గురించి తెలియజేసే బాధ్యత మినహాయింపు ఫారమ్‌పై కూడా ప్రజలు సంతకం చేయాలి. మకావు టవర్ నుండి బంగీ జంపింగ్ చేయడానికి కస్టమర్లు 360 డాలర్లు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 30వేలు చెల్లిస్తారు.

మకావు టవర్ బంగీ జంపింగ్‌లో అవాంఛనీయ సంఘటనలు జరగడం ఇదేం మొదటిసారి కాదు. జనవరి 2018లో, ఒక రష్యన్ టూరిస్ట్ మకావు టవర్ నుండి గాలిలో వేలాడాడు. హాంకాంగ్ ఫ్రీ ప్రెస్ ప్రకారం, పర్యాటకుడిని అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన ఉపయోగించి రక్షించాల్సి వచ్చింది. ఈ ఘటనలో పర్యాటకుడు గాయపడనప్పటికీ, అతను రక్షించబడటానికి ముందు చలిలో ఒక గంట పాటు నేలపై నుంచి 55 అడుగుల ఎత్తులో వేలాడినందున అతన్ని కాపాడడం చాలా కష్టంగా మారింది.