గ్రేటర్ లో ట్రాఫికర్.. వరంగల్ నగరంలో సమస్యాత్మకంగా పలు ప్రాంతాలు

గ్రేటర్ లో ట్రాఫికర్.. వరంగల్ నగరంలో సమస్యాత్మకంగా పలు ప్రాంతాలు
  • ఫాతిమానగర్, చింతగట్టు క్యాంప్ వద్ద ఇరుకు బ్రిడ్జిలతో ఇబ్బందులు
  • మేడారం జాతరకు ఈ రూట్లలోనే వేలాది వెహికల్స్ రాకపోకలు
  • ప్రత్యామ్నాయ చర్యలు చేపడితేనే మేలు

హనుమకొండ, వెలుగు:  మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమైంది. వరంగల్ నగరం మీదుగా లక్షలాది వెహికల్స్ రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ, గ్రేటర్ సిటీ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలను ట్రాఫిక్ జామ్ సమస్య కలవరపెడుతోంది. ట్రై సిటీలోని కాజీపేట పాటు ఎల్కతుర్తి, హసన్ పర్తి, చింతగట్టు మీదుగా రింగ్ రోడ్డు ఎక్కే వెహికల్స్ కు మధ్యలో ఉన్న ఇరుకు బ్రిడ్జిలు సమస్యగా మారాయి. దీంతో చిన్నచిన్న కారణాలకు కూడా ఆయా చోట్లా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుండగా, మేడారం జాతర మొదలైతే సమస్య తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. జాతర సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నిర్వహణ చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

ఇరుకుగా ఎస్సారెస్పీ బ్రిడ్జిలు.. 

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఉమ్మడి మెదక్ వైపు నుంచి వచ్చే వెహికల్స్ తో పాటు వివిధ గ్రామాల నుంచి చింతగట్టు మీదుగా వరంగల్ రింగ్ రోడ్డు (ఎన్​హెచ్-163 బైపాస్) ఎక్కే వాహనాలకు చింతగట్టు క్యాంప్ వద్ద ఉన్న ఎస్సారెస్పీ కెనాల్ బ్రిడ్జి సమస్యగా మారింది. దశాబ్ధాల కింద నిర్మించిన బ్రిడ్జి కావడం, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో తరచూ ట్రాఫిక్ జామ్ సమస్య ఉంటుంది. సోమవారం చింతగట్టు బ్రిడ్జి వద్ద వెహికల్స్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండటంతో దాదాపు గంట పాటు రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో చింతగట్టు ఎస్సారెస్పీ కెనాల్ నుంచి రామారం వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవగా, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ఇదిలాఉంటే ఎల్కతుర్తి, హసన్ పర్తి మధ్యలో అనంతసాగర్ వద్ద ఉన్న ఎస్సారెస్పీ బ్రిడ్జి వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ బ్రిడ్జిలు కొన్నేండ్ల కింద నిర్మించినవి కావడం, అడపాదడపా ప్రమాదాలకు గురై బ్రిడ్జిలకు ఇరువైపులా రెయిలింగ్ దెబ్బతిని డేంజరస్ గా మారాయి. దీంతో బ్రిడ్జిలను విస్తరించి, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.

'ఫాతిమా' రెండో బ్రిడ్జికి బ్రేకులు..

హైదరాబాద్ నుంచి వరంగల్ కు రావాలన్నా కాజీపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మేడారం వైపు వెళ్లాలన్నా మధ్యలో ఉన్న ఫాతిమా నగర్ బ్రిడ్జి దాటాల్సిందే. కానీ ఇక్కడున్న బ్రిడ్జిని దాదాపు 50 ఏండ్ల కింద అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మించగా, ఇప్పుడు వేల సంఖ్యలో వస్తున్న వాహనాలకు అది సరిపోవడం లేదు. పైగా బ్రిడ్జి చాలాచోట్ల దెబ్బతింది. దీంతో ఈ బ్రిడ్జిని వన్ వేకు ఉపయోగించేలా దానికి సమాంతరంగా దాదాపు 870 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో మరో బ్రిడ్జి నిర్మించేందుకు 2018లో శంకుస్థాపన చేశారు. సుమారు రూ.78 కోట్లతో పనులు చేపట్టగా, 2021 లోనే పూర్తి చేస్తామని అప్పటి లీడర్లు చెప్పారు.

 కానీ సక్రమంగా ఫండ్స్ రిలీజ్ చేయక అప్పట్లో పనులు ఆగిపోగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ విడుదల చేయడంతో పాటు పనులు స్పీడప్ చేయించారు. ఈ మేరకు బ్రిడ్జిపై ఏర్పాటు చేసేందుకు గడ్డర్లు కూడా రెడీ చేశారు. కానీ రైల్వే శాఖ అనుమతుల్లో జాప్యం జరుగుతుండటంతో ఫాతిమా నగర్ బ్రిడ్జి వర్క్స్ ఇంతవరకు పూర్తి కాలేదు. ఫలితంగా ఇరువైపులా రాకపోకలకు పాత బ్రిడ్జి మాత్రమే ఉపయోగపడుతోంది. దీంతో తరచూ బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ జరుగుతోంది. ఇప్పుడు మేడారం జాతర స్టార్ట్ అయితే బ్రిడ్జిపై డైలీ లక్షలాది వెహికల్స్ రాకపోకలు సాగించే అవకాశం ఉండగా, ట్రాఫిక్ జామ్ సమస్య మరింత తీవ్రమయ్యే ఛాన్స్ ఉంది. 

ఎన్​హెచ్-563ని ఉపయోగిస్తే మేలు..

ఉమ్మడి మెదక్, ఎల్కతుర్తి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో చింతగట్టు బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుండగా, ఆ వైపు నుంచి వచ్చే వాహనాలు ఎన్​హెచ్-563ని ఉపయోగిస్తే ఇక్కడ సమస్య తీరే అవకాశం ఉంది. కరీంనగర్-వరంగల్ హైవే (ఎన్​హెచ్-563)ను ఫోర్ లైన్ గా విస్తరిస్తుండగా, కొన్నిచోట్ల బ్రిడ్జిలు మినహా రోడ్డు వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఇలా హసన్ పర్తి సమీపంలో సీతంపేట నుంచి ఎన్​హెచ్ 563 మీదుగా వచ్చి పలువేల్పుల-ముచ్చర్ల క్రాస్ వద్ద వరంగల్ రింగ్ రోడ్డు ఎక్కితే చింతగట్టు ఎస్సారెస్పీ కెనాల్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

దీంతో పోలీసులు మేడారం జాతర సమయంలో సాధ్యమైనంత మేరకు ఎన్​హెచ్-563ని ఉపయోగించేలా చర్యలు చేపడితే ట్రాఫిక్ జామ్ సమస్యకు కొంతమేర సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది. దీంతో ఆ దిశగా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.