
- అడవిని ఖాళీ చేసిన ఆదివాసీ గిరిజనులు
- భారీగా మోహరించిన ఫారెస్ట్ అధికారులు
- గిరిజనులు వేసుకున్న గుడిసెల తొలగింపు
- కవ్వాల్ టైగర్ జోన్లో మూడు నెలల ఉద్రిక్తతకు తెర
జన్నారం రూరల్, వెలుగు: కవ్వాల్ టైగర్ రిజర్వ్ జన్నారం మండలం ఇందన్పల్లి రేంజ్ పరిధిలోని పాలగోరీ పోడు భూముల కథ సుఖాంతమైంది. అక్కడ తమ పూర్వీకులు నివాసమున్నారంటూ గుడిసెలు వేసుకొన్న ఆదివాసీ గిరిజనులు.. ఫారెస్టు, పోలీసు అధికారుల హెచ్చరికలతో అడవిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. అనంతరం భారీ సంఖ్యలో సిబ్బందితో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఆదివాసీల గుడిసెలను తొలగించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు.
మూడు నెలలుగా లొల్లి
మూడు నెలల క్రితం కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని పాలగోరి ప్రాంతంలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్, సిర్పూర్(యు) మండలాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు గుడిసెలు వేసుకొని నివాసం ఏర్పర్చుకున్నారు. వారిని అడ్డుకొని గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నించిన ఫారెస్ట్ అధికారుల కళ్లల్లో కారం కొట్టి దాడికి పాల్పడ్డారు. అనంతరం ఫారెస్ట్ ఆఫీసర్లు మండల అధికారులతో కలిసి చాలా రకాలుగా వారికి నచ్చజెప్పారు.
అయినా ఆదివాసీలు అంతటితో ఆగకుండా దాదాపు 300కు పైగా విలువైన టేకు చెట్లను నరికివేసి సాగు చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు పోలీసులతో కలిసి వారిపై 50కి పైగా కేసులు పెట్టారు. ఆపై గత సోమవారం 26 మందిని కోర్టులో హాజరుపర్చిన తర్వాత రిమాండ్కు తరలించారు. ఈ ఘటనతో ఇతర ప్రాంతాల గిరిజనులు కూడా అడివిలోకి చొరబడుతున్నట్లు తెలుసుకున్న ఫారెస్ట్అధికారులు వారిని ఖాళీ చేయించేందుకు కఠిన చర్యలకు సిద్ధపడ్డారు.
పాలగోరీ నుంచి వెళ్లిన ఆదివాసీలు
ఆదివాసీ గిరిజనులను పాలగోరి ప్రాంతం నుంచి పంపించేందుకు ఫారెస్ట్, పోలీసు అధికారులు పక్కాగా ప్లాన్ వేశారు. ఎఫ్డీవో రామ్మోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం దాదాపు 300 అటవీ సిబ్బంది పాలగోరీ ప్రాంతంలో మోహరించారు. అంతకుముందే రెవెన్యూ, పోలీస్ అధికారులు పాలగోరి వెళ్లి అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. అడవి నుంచి వెళ్లిపోకపోతే అరెస్టు తప్పదని వార్నింగ్ ఇవ్వడంతో ఆదివాసీ గిరిజనులు అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం ఫారెస్టు సిబ్బంది గుడిసెలను తొలగించి ఆ ప్రాంతాన్ని తమ కంట్రోల్ లోకి తీసుకున్నారు. ఎలాంటి గొడవ లేకుండా అంతా సాఫీగా జరగడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
అడవుల సంరక్షణతోనే మనుగడ
జన్నారం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్(ఎఫ్డీవో) రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. పాలగోరీ ప్రాంతంలో మూడు నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అడవులను ఎవరు ఆక్రమించడానికి ప్రయత్నించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. అటవీ సంరక్షణతో మానవ మనుగడ కొనసాగుతుందన్నారు. ఎఫ్ఆర్వోలు శ్రీధర్ ఆచారి, సుష్మారావు, హఫీజ్, జన్నారం, దండేపల్లి ఎస్సైలు పాల్గొన్నారు.