
- వచ్చే అకడమిక్ ఇయర్ నుంచే క్లాస్‌లు ప్రారంభించే చాన్స్
- వారంలో అధికారిక ప్రకటన ?
మహబూబ్‌నగర్, వెలుగు : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో.. బాసర ట్రిపుల్ ఐటీ అనుబంధ క్యాంపస్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. పాలమూరులో ఉన్నత విద్యా సంస్థ ఏర్పాటుకు కృషి చేస్తానని అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు.. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు ప్రయత్నాలు తీవ్రం చేశారు. అన్నీ కుదిరితే పాలమూరులో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు మరో వారంలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
43 ఎకరాల్లో ఏర్పాటు
పాలమూరు జిల్లాలో ట్రిపుల్ క్యాంపస్ ఏర్పాటు కోసం బాసర యూనివర్సిటీ వీసీ గోవర్ధన్, జేఎన్‌టీయూ మాజీ రిజిస్ట్రార్ మంజూరు హుస్సేన్ కలిసి ఈ నెల 3న జిల్లాలో పర్యటించారు. క్యాంపస్ ఏర్పాటుకు 43 ఎకరాల స్థలం అవసరం ఉండడంతో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని దివిటిపల్లి ఎదిర, మల్లెబోయిన్‌పల్లి, పాలమూరు యూనివర్సిటీ సమీపంలో స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఇతర విషయాలపై ఉన్నతాధికారులతో చర్చించారు.
అన్ని అంశాలను పరిశీలించి, రూపొందించిన రిపోర్ట్‌ను తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌కు అందజేయగా, వారు ఈ నెల 8న ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. అయితే దివిటిపల్లి-ఎదిర వద్ద ఉన్న స్థలం నేషనల్ హైవేకు సమీపంలో ఉండడంతో ఈ స్థలాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అవసరం అయితే మరికొంత స్థలం కూడా సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వచ్చే సంవత్సరం నుంచే క్లాస్‌లు
మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో వచ్చే అకడమిక్ ఇయర్ నుంచే క్లాసులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మొదట కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో క్లాస్‌లు మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ప్రతి కోర్సులో 60 మంది స్టూడెంట్లకు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో అవకాశం కల్పించనున్నారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి క్లాస్‌లు ప్రారంభిస్తే స్టూడెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెడ్డి హాస్టల్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. కమిటీ సభ్యులు ఈ హాస్టల్‌ను కూడా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
వారంలో అధికారిక ప్రకటన
పాలమూరును ఎడ్యుకేషన్ సెంటర్ గా మార్చాలన్నదే లక్ష్యం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. జిల్లాలో ట్రిపుల్ ఐటీ బ్రాంచ్‌ను సాధించుకున్నాం. వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రానుంది. ఐఐఐటీ ఏర్పాటు వల్ల స్థానిక స్టూడెంట్లకు ఉన్నత విద్య అందనుంది. - యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్