ఎమ్మెల్యే తిట్టాడని.. కన్నీరు పెట్టిన మహిళా కార్పొరేటర్

ఎమ్మెల్యే తిట్టాడని.. కన్నీరు పెట్టిన మహిళా కార్పొరేటర్

హైదరాబాద్: తన సొంత పార్టీకి చెందిన ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి అసభ్యంగా తిడుతూ.. చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని అధికార టీఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కంటతడిపెట్టారు. బీసీ మహిళనైన తనను చెప్పుకోలేని విధంగా అది..ఇది అని అసభ్యంగా తిడుతున్నాడని కన్నీరు పెట్టుకున్నారు. 10వేలు ఇచ్చి రౌడీలు, గూండాలతో చంపిస్తానని బెదిరింపులకు పాల్పతున్నాడని ఆరోపించారు. 

ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కనీసం  ప్రోటో కాల్ కూడా పాటించడం లేదని మండిపడ్డారు. కుషాయిగూడలో మోడల్ దోబీ ఘాట్ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం లేదన్నారు. స్థానిక కార్పొరేటర్ లేకుండా దోబీ ఘాట్ ను ఎలా ప్రారంభిస్తారని  ప్రశ్నించారు. భేతి సుభాష్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే సహించేది లేదన్నారు. 

సిటీ టీఆర్ఎస్లో భగ్గుమన్న విభేదాలు

అధికార టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కాప్రా సర్కిల్ కుషాయిగూడలో 54 లక్షల వ్యయంతో మరమత్తులు చేసి, కొత్త మిషనరీ ఏర్పాటు చేసిన మోడరన్ దోభీఘాట్ ప్రారంభోత్సవం సందర్భంగా విభేదాలు రచ్చకెక్కాయి. ఆధునీకరించిన  మోడల్ దోభీ ఘాట్ ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభోత్సవం చేశారు. కొంతసేపటి తర్వాత మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్, మరికొంతమంది కార్పొరేటర్లతో కలిసి మరోసారి ధోబిఘాట్ ను  ప్రారంభించారు. ఈ సందర్భంగా చర్లపల్లి డివిజన్​ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ​మీడియా సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ప్రోటో కాల్ పాటించడం లేదని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దోభీ ఘాట్ ను కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి హాజరై ప్రారంభించిన సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ప్రొటో కాల్ పాటించలేదని ఆరోపించారు. స్థానిక కార్పొరేటర్ ను అయిన తాను లేకుండా దోబీఘాట్ ను ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. బీసీ మహిళా కార్పొరేటర్  అయిన తనను మర్యాద లేకుండా దూషిస్తున్నారని, అది.. ఇది.. దానికేమిటి చెప్పేది.. అని మాట్లాడుతున్నారని శ్రీదేవి ఆరోపించారు. 

ప్రతి కాలనీలో గ్రూపు రాజకీయాలు చేస్తుండు

ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గ్రూపు రాజకీయాలు చేస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని కార్పొరేటర్ శ్రీదేవి దుయ్యబట్టారు. ఇతర మహిళలతో తన గురించి పిచ్చి పిచ్చి మాటలు, బూతులు మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ.. అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే సహించేది లేదని కార్పొరేటర్ శ్రీదేవి హెచ్చరించారు.

తనను ‘గొల్లది, ఏం చేస్తుంది అని అవమానిస్తున్నారని..అవును.. నేను గొల్ల బిడ్డనే..మేం యాదవులమే..యాదవ బిడ్డను నేను.. శ్రీ కృష్ణుని వంశస్తులము’ అని శ్రీదేవి చెప్పారు. నన్ను నాన్ లోకల్ అని ముద్ర వేసి గొల్లది అని అవమానిస్తే గొల్లలు, యాదవ బిడ్డలు కలసి బుధ్ది చెబుతారని శ్రీదేవి హెచ్చరించారు. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అవలంబిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతోపాటు నిత్యం అసత్య ఆరోపణలు చేస్తూ.. తనను బూతులు తిడుతున్న విషయాలను సీఎం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళతానని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ప్రకటించారు.