
టొరంటో, న్యూఢిల్లీ: భారత్‌లో ఉన్న తమ డిప్లొమాట్స్ 41 మందిని వెనక్కి రప్పించామని కెనడా ప్రకటించింది. వాళ్లకు దౌత్యపరమైన రక్షణ తొలగిస్తామని భారత్ బెదిరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. చండీగఢ్, ముంబై, బెంగళూర్ లోని కాన్సులేట్ ఆఫీసుల్లో సేవలను నిలిపివేసింది. కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో మా దేశ డిప్లొమాట్స్ 62 మంది ఉన్నారు. అయితే వారిలో 21 మంది డిప్లొమాట్స్, వాళ్ల కుటుంబసభ్యులకు మాత్రమే దౌత్యపరమైన రక్షణ కల్పిస్తామని ఇండియా తెలిపింది.
మిగతా 41 మంది డిప్లొమాట్స్, వాళ్ల కుటుంబసభ్యులు 42 మందికి ఈ నెల 20 నుంచి దౌత్యపరమైన రక్షణ తొలగిస్తామని అధికారికంగా వెల్లడించింది. దీనివల్ల వారి వ్యక్తిగత భద్రత ప్రమాదంలో పడుతుంది. అందుకే వాళ్లందరినీ వెనక్కి రప్పించాం” అని వెల్లడించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను భారత్ పెంచుతోందని ఆరోపించారు. ‘‘భారత్ ఇలా బెదిరింపులకు గురిచేయడం సరికాదు. ఇది అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం. దౌత్యపరమైన రక్షణ తొలగింపునకు మేం ఒప్పుకుంటే.. డిప్లొమాట్స్ కు సేఫ్టీ అనేదే లేకుండా పోతుంది. అందుకే మేం భారత్ లా చేయాలనుకోవడం లేదు” అని చెప్పారు. తాము అంతర్జాతీయ చట్టాలను సమర్థిస్తామని, భారత్‌తోనూ చర్చలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఇండియాలో జాగ్రత్త.. తన పౌరులకు అడ్వైజరీ
ఇండియాలో.. మరీ ముఖ్యంగా ఢిల్లీ, చండీగఢ్, ముంబై, బెంగళూర్ సిటీల్లోని కెనడియన్లు అప్రమత్తంగా ఉండాలని కెనడా ప్రభుత్వం సూచించింది. ‘‘ఇండియాలో టెర్రర్ దాడులు జరిగే అవకాశం ఉంది. అలాగే కెనడా, భారత్ మధ్య ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కెనడాకు వ్యతిరేకంగా నిరసనలు జరగొచ్చు. కెనడియన్లను వేధింపులకు గురిచేయొచ్చు. జాగ్రత్తగా ఉండండి” అని హెచ్చరించింది.
నిబంధనల ప్రకారమే స్పందించాం: భారత్
దౌత్య వేత్తలను వాపస్ పిలిపించుకుంటూ కెనడా చేసిన ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. వియన్నా ఒప్పందం మేరకు ఇరువైపులా దౌత్యవేత్తల సంఖ్య కాస్త అటూఇటూగా ఒకేలా ఉండాలని చెప్పింది. ఈ నియమం మేరకే దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని కోరినట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.