Trump vs EU: యూరోపియన్ దేశాలపై ట్రంప్ ఫైర్.. రష్యన్ ఆయిల్ కొనొద్దంటూ సీరియస్..

Trump vs EU: యూరోపియన్ దేశాలపై ట్రంప్ ఫైర్.. రష్యన్ ఆయిల్ కొనొద్దంటూ సీరియస్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కఠిన కామెంట్స్ చేశారు. ఇంతకుముందు చైనా, భారత్‌పై రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి ఆంక్షలు, సుంకాలు విధించిన ట్రంప్.. ఇప్పుడు దృష్టిని యూరోపియన్ మిత్రదేశాలపై పెట్టారు. ఈ క్రమంలో యూరప్ ఇంకా రష్యా చమురు కొనుగోలు చేస్తోందంటూ ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సీరియస్ అయ్యారు. యూరోపియన్ దేశాలు రష్యాతో బిజినెస్ చేయకూడదని తాను అనుకుంటున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.

తాను మరింత కఠిన ఆంక్షలకు సిద్ధంగా ఉన్నానన్న ట్రంప్.. యూరోపియన్ దేశాలు కూడా అదే స్థాయిలో తగిన విధంగా ఆంక్షలు విధించాలని కోరారు ట్రంప్. రష్యా చమురు ఎగుమతుల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతుందని ట్రంప్ మాటల ప్రకారం అర్థం అవుతోంది. అదే రష్యాకు ఉక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగించేందుకు సహకరిస్తోందని అమెరికా గట్టిగా నమ్ముతోంది. అంతకుముందు ట్రంప్ భారత్‌పై రష్యా నుంచి “భారీ చమురు కొనుగోలు” చేస్తున్నదని ఆరోపించి 50 శాతం సుంకం విధించారు. అదేవిధంగా చైనాపై కూడా 50–100 శాతం మేర ఆంక్షలు విధించాలని నాటో దేశాలను పిలుపునిచ్చారు.

ట్రంప్ వాదన ప్రకారం చైనా రష్యాకు ఆర్థిక సహకారం అందించి ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని పొడిగిస్తోందని అభిప్రాయం ఉంది. దీనిపై చైనా పరోక్షంగా స్పందించింది. తాము యుద్ధాల్లో పాల్గొనమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ట్రంప్ కామెంట్లకు బదులిచ్చారు. సమస్యలను యుద్ధం పరిష్కరించదు. ఆంక్షలు సమస్యను మరింత క్లిష్టం చేస్తాయి. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం మాత్రమే మార్గంగా తాము నమ్ముతున్నట్లు వాంగ్ అన్నారు. యూరోపియన్ దేశాలతో చైనాకు సహకారం పెంపు అవసరమని కూడా చెప్పారు.

ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏంటంటే.. ఈసారి ట్రంప్ భారత్‌ను విమర్శించకుండా మాట్లాడటమే. అమెరికా-భారత్ మధ్య ఓ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని దీనికి సంకేతాలుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు ట్రంప్ మధ్యవర్తిత్వం చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ.. ఆయన ప్రతిపాదిస్తున్న రష్యాపై ఆర్థిక ఒత్తిడి వ్యూహం మిత్రదేశాలకే సవాలుగా మారుతోంది. చూడాలి ట్రంప్ పుతిన్ ను ఎలా తన దారికి తెచ్చుకుంటారో.