జేపీఎస్‌‌ల రెగ్యులరైజేషన్‌‌కు ఉత్తర్వులు

జేపీఎస్‌‌ల రెగ్యులరైజేషన్‌‌కు ఉత్తర్వులు
  • సర్వీస్ రూల్స్‌‌ 84 జీవోలో సవరణలు
  • త్వరలో ‘గ్రేడ్‌‌4’లోకి జేపీఎస్‌‌లు


హైదరాబాద్, వెలుగు: జూనియర్‌‌‌‌ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేయటానికి మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించి పంచాయతీ రాజ్ సర్వీస్ రూల్స్ జీవో 84 లో సవరణలు చేస్తూ పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ర్టంలో గ్రామ పంచాయతీల సంఖ్యకు అనుగుణంగా గ్రేడ్ 1, 2, 3, 4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులతో పాటు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఎంత మంది ఉన్నారన్న వివరాలను జీవో లో పేర్కొన్నారు. మొత్తం 12,751 జీపీలకు గానూ.. గ్రేడ్ 1 లో 516 పోస్టులు, గ్రేడ్ 2లో 536, గ్రేడ్ 3 లో  2,626, గ్రేడ్ 4 లో 2,230 పోస్టులు, జేపీఎస్ పోస్టులు 6,603 ఉన్నట్లు వివరించారు. 

ఈ మేరకు జేపీఎస్ లను ప్రభుత్వం గ్రేడ్ 4 గా త్వరలో రెగ్యులర్ చేయనుంది. జేపీఎస్ లు, ఔట్ సోర్సింగ్ సెక్రటరీలు కలిసి రాష్ర్టంలో సుమారు 9,300 మంది పనిచేస్తున్నారు.  ఇందుకు సంబంధించి జిల్లాలో ముగ్గురు అధికారుల కమిటీలు జేపీఎస్‌‌ల పనితీరు లెక్కించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇందులో భాగంగానే జేపీఎస్‌‌లను రెగ్యులర్ చేసేందుకు ఈ జీవో ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఉమ్మడి ఏపీలో ఇచ్చిన 81 జీవోలో కూడా సవరణలు చేయాలని పంచాయతీ రాజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి కోరారు. 81 జీవోలో సవరణలు చేస్తే రానున్న రోజుల్లో జేపీఎస్ లు గ్రేడ్ 4 నుంచి 3, 2, 1కి ప్రమోషన్లు వస్తారని, రిటైర్ అయినా, పోస్టు ఖాళీగా ఉన్నా డైరెక్ట్ రిక్రూట్ మెంట్ సాధ్యమవుతుందని చెప్పారు. జనాభా లేదా ఆదాయం ప్రాతిపదికన గ్రామ పంచాయతీలను గ్రేడ్లుగా విభజించాలని డిమాండ్ చేశారు.