కొత్త ఎంపీడీఓలకు శిక్షణ ప్రారంభం

కొత్త ఎంపీడీఓలకు శిక్షణ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:​ కొత్తగా నియమితులైన మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు హైదరాబాద్‌‌లోని రాజేంద్రనగర్‌‌‌‌లో ఉన్న టీఎస్‌‌ఐఆర్‌‌‌‌డీలో సోమవారం నుంచి శిక్షణ ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమం 27 వరకు కొనసాగనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు మొత్తం 139 మంది కొత్త ఎంపీడీఓలను కేటాయించగా.. అందులో 131 మంది రిపోర్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారు త్వరలోనే శిక్షణలో చేరనున్నారు. కొత్త ఎంపీడీఓలకు వారి విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు.

 పంచాయతీ రాజ్ చట్టం, ప్రభుత్వ పథకాలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, పాలనాపరమైన విధానాలు, ఆర్థిక నిర్వహణ, ప్రజలతో మెరుగైన సంబంధాలు వంటి అనేక కీలక అంశాలపై అవగాహన కల్పించనున్నారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌‌లు, జిల్లా పరిషత్‌‌ల నిర్మాణం, అధికారాలు, విధులు, ఎన్నికల ప్రక్రియ, నిధుల వినియోగం, ఉపాధి హామీ పథకం, గ్రామీణ తాగునీటి సరఫరా, పారిశుధ్యం, గృహ నిర్మాణం వంటి వివిధ ప్రభుత్వ పథకాలను వివరించనున్నారు. 

కార్యాలయ నిర్వహణ, రికార్డుల భద్రత, ప్రభుత్వ ఉత్తర్వులు, సర్క్యులర్ల అమలు, ఫిర్యాదుల పరిష్కారం, నిధుల కేటాయింపు, బడ్జెట్ తయారీ, ఆడిటింగ్ ప్రక్రియ, పారదర్శక ఆర్థిక లావాదేవీలు, ప్రజల సమస్యలు వినడం, పరిష్కరించడం, సుపరిపాలన అందించడం, సర్వీస్, ఫైనాన్స్, లీవ్, డిసిప్లేన్ రూల్స్ తదితర అంశాలపై సీఈఓలు, డీపీఓలు, ఎంపీడీఓలు తదితరులు శిక్షణ ఇవ్వనున్నారు. తొలి రోజు ఈ కార్యక్రమాన్ని పీఆర్ఆర్డీ డైరెక్టర్ సృజన పర్యవేక్షించారు.