కాంగ్రెస్లో చేరడం కన్ఫర్మ్.. పాలేరుపై తుమ్మల పట్టు

కాంగ్రెస్లో చేరడం కన్ఫర్మ్.. పాలేరుపై తుమ్మల పట్టు

కాంగ్రెస్​ కార్యకర్తల్లో షర్మిల పార్టీ విలీనం, తుమ్మల చేరికపైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. వీళ్లిద్దరి వల్ల పార్టీకి కలిగే లాభనష్టాలపై డిస్కషన్ ఒకవైపు ఉండగా, మరోవైపు టికెట్ ఎవరు తెచ్చుకుంటారనే చర్చ ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో తుమ్మల భేటీ కావడంతో, బీఆర్ఎస్ను వీడి ఆయన కాంగ్రెస్లో చేరడం దాదాపు కన్ఫామ్ అయింది. అయితే పాలేరు సీటును కేటాయిస్తామని హామీ వచ్చిన తర్వాతే రేవంత్ రెడ్డితో మీటింగ్​కు తుమ్మల ఒప్పుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

కాంగ్రెస్ నుంచి దీనికి కొంత భిన్నంగా సమాచారం తెలుస్తోంది. పాలేరు సీటు కన్ఫామ్​ చేసేందుకు వంద శాతం ప్రయత్నిస్తానని, కానీ పార్టీ అవసరాల దృష్ట్యా అవకాశాన్ని బట్టి ఖమ్మంలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని తుమ్మలకు రేవంత్ చెప్పినట్టు సమాచారం. ఖమ్మంలో పోటీ చేసేందుకు సిద్ధమైతే ఎన్నికల ఖర్చు విషయాన్ని కూడా తాను చూసుకుంటానని హామీనిచ్చినట్టు టాక్​ వినిపిస్తోంది. 

హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లి నుంచి తుమ్మలను పోటీ చేయాలని కాంగ్రెస్ కోరినట్టుగా ప్రచారం జరిగినా, తుమ్మల మాత్రం పాలేరు తప్పించి మరెక్కడా పోటీపై తనకు ఆసక్తి లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. ఇండిపెండెంట్ గా అయినా బరిలో ఉంటాను తప్పించి, సీటు మారేది లేదని తేల్చి చెప్పారని, ఆ తర్వాతనే రేవంత్ రెడ్డితో మీటింగ్ జరిగిందని అంటున్నారు. కాంగ్రెస్​ మాత్రం కమ్యూనిటీ ఈక్వేషన్ల దృష్ట్యా పాలేరు నుంచి పొంగులేటిని, ఖమ్మం నుంచి తుమ్మలను పోటీ చేయించాలని భావిస్తోందని సమాచారం.