రుణ యాప్ కేసులో ట్విస్ట్..మరో బ్యాంకు మేనేజర్ అరెస్ట్

రుణ యాప్ కేసులో ట్విస్ట్..మరో బ్యాంకు మేనేజర్ అరెస్ట్
  • ఫ్రీజ్ చేసిన అకౌంట్ నుంచి నగదు మళ్లించిన ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ రాకేష్ కుమార్ దాస్ 

హైదరాబాద్: బ్యాంకు మేనేజర్ అరెస్టుతో రుణ యాప్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అంతేకాదు ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సైబర్ క్రైమ్, ఆర్ధిక విభాగం పోలీసుల విచారణలో ఉన్న ఈ కేసులో బ్యాంకు మేనేజర్ అరెస్టు కావడం కలకలం రేపింది. కోల్ కతాలోని అలీపూర్ లో ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్న రాకేశ్ కుమార్ దాస్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
రుణ యాప్ కేసులో ఫ్రీజ్ చేసిన అకౌంట్ నుంచి 1.18 కోట్ల రూపాయల నగదు బదిలీ కావడం గచ్చిబౌలి ఐసీఐసీఐ బ్యాంకు రీజినల్ మేనేజర్ గుర్తించారు. కోల్ కతా లోని అలీపూర్ శాఖ నుంచి 1.18 కోట్ల నగదు బదిలీ కావడం గమనించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు అలీపూర్ వెళ్లి ఐసీఐసీఐ బ్యాంకులో విచారించగా.. మేనేజర్ రాకేష్ కుమార్ దాస్ నగదు మళ్లించినట్లు గుర్తించారు.

ఫ్రీజ్ అయిన అకౌంట్ నుంచి డ్రా చేసేందుకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించగా.. సైబర్ క్రైమ్ ఎస్ఐ వచ్చి అకౌంట్ డీఫ్రీజ్ చేయమని చెప్పాడని, అందుకే చేశానని చెప్పినట్లు సమాచారం. సరైన పత్రాలు లేకున్నా ఎలా అనుమతిచ్చారని సైబర్ క్రైమ్ పోలీసులు గట్టిగా నిలదీయగా.. సైబర్ క్రైమ్ ఎస్.ఐలా వచ్చిన నల్లమోతు అనిల్ కుమార్, సహచరుడు అనంద్ జున్ను తనకు కమీషన్ ప్రలోభపెట్టడంతో అనుమతిచ్చానని అంగీకరించక తప్పలేదు.దీంతో ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ రాకేష్ కుమార్ దాస్ ను అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు. కాగా ఎస్.ఐలా నటించిన నల్లమోతు అనిల్ కుమార్ తోపాటు అతని సహచరుడు ఆనంద్ ను ఇంతకు ముందే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా మేనేజర్ ను కూడా కటకటాల వెనక్కు పంపారు.