స్కూల్ లేదు.. పశువుల మేత తీసుకురమ్మంటే..

 స్కూల్ లేదు.. పశువుల మేత తీసుకురమ్మంటే..
  • కాలువలో జారిపడి నీట మునిగి ఇద్దరు బాలికలు మృతి
  • కడప జిల్లా రాజుపాలెం మండలం వాసుదేవపురం వద్ద ఘటన

కడప: స్కూల్ ఎలాగూ లేదు.. ఎంతసేపు ఆడుకుంటారు.. పశువుల మేత తీసుకురమ్మని తల్లిదండ్రులు చెప్పిన మాట విన్న బాలికలు.. మేత కోసం వెళ్తూ.. కాలువలో జారిపడ్డారు. ఊహించని ఘటనతో బయటపడేందుకు ప్రయత్నించినా.. ఈత రాక నీట మునిగిపోయారు. కడప జిల్లా రాజుపాలెం మండలం వాసుదేవపురంలో సోమవారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 
గ్రామానికి చెందిన మల్లీశ్వరి (12), ఇరగం రెడ్డి రాధ (9) బాలికలు ఇద్దరూ ఇవాళ ఉదయం ఇంటి నుంచి పశువుల మేత కోసం బయలుదేరారు. గ్రామ శివార్లలో కర్నూలు-కడప కాలువలో నీటి ప్రవాహం చూసి తాగునీటి కోసం ఆగినట్లున్నారు. సంవత్సరంలో చాలా కాలం ఖాళీగా ఉండే కాలువలో  చాలా కాలం తర్వాత నీటి ప్రవాహం కనిపించడంతో ఇద్దరూ కలసి కాలువ మెట్ల మీద నిలబడి నీళ్లు తాగేందుకు ప్రయత్నించారు. మెట్లమీద.. బండరాయిపై పాశిపట్టిన చోట నిలబడడంతో కాలు జారి కాలువలో పడ్డారు.  నీటి ప్రవాహం ఉధృతంగా ఉండండంతో ప్రవాహంలో కొట్టుకుని పోతూ కేకలు వేసినా ప్రయోజనం లేకపోయింది.

నీట మునిగిపోవడంతో ఊపిరాడక చనిపోయారు. మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తుండగా.. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.