- బురదలో కూరుకుపోయారు..
- బురదలో నుంచి బయటపడలేక బావా బామ్మర్దుల మృతి
సిద్దిపేట జిల్లా: కోహెడ మండలం పోరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని మోయ తుమ్మెద వాగు చెక్ డ్యామ్ లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగు లో మునిగి ప్రశాంత్ (21), కుమారస్వామి (19) అనే ఇద్దరు బావ, బామ్మర్దులు మృతి చెందారు. కుంటలో నీళ్లను చూసి వీరు ముచ్చటపడ్డారు. దుస్తులు విప్పి గట్టున పెట్టి ఈతకు దిగారు. కుంట మధ్యలోకి వెళ్లి ఒకరితర్వాత ఒకరు బురదలో కూరుకుపోయారు. అరిచి ఆర్తనాదాలు చేసేందుకు ప్రయత్నిస్తే.. చుట్టుపక్కల ఎవరూ లేరు. బురదలో నుంచి బయటపడేందుకు విశ్వప్రయత్నం చేసినా బయటపడలేకపోయారు. గ్రామస్తులు కుంట దగ్గర దుస్తులు చూసి ఎవరూ ఇందులో దిగి ఈతకు దిగి చనిపోయినట్లున్నారని అనుమానించారు. దుస్తుల దగ్గరున్న ఆనవాళ్లు, మొబైల్ ఫోన్లను బట్టి గ్రామానికి చెందిన ప్రశాంత్, మునిస్వామి అనే బావా బామ్మర్దులుగా గుర్తించారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నలుగురు గజ ఈతగాళ్లను దింపి చూడగా.. ఇద్దరు బురదలో కూరుకుపోయినట్లు తేలింది. బురదలో కూరుకుపోయిన ఇద్దరి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.