మరియుపోల్​లో రష్యా నరమేధం

మరియుపోల్​లో రష్యా నరమేధం
  • ట్రక్కుల్లో శవాలు తెచ్చి 200 సమాధుల్లో డంపింగ్ 
  • శాటిలైట్ ఫొటోల్లో నిజం బయటపడిందన్న అధికారులు  

కీవ్: మరియుపోల్ నగరంలో 9 వేల మంది పౌరులను రష్యన్ సోల్జర్లు చంపేశారని, ఈ దారుణాన్ని దాచిపెట్టేందుకు రెండు వందలకుపైగా భారీ సమాధులు తవ్వి మృతదేహాలను పూడ్చిపెట్టారని ఉక్రెయిన్ ఆరోపించింది. రాజధాని కీవ్ సిటీకి సమీపంలోని బుచా నగరంలో బయటపడ్డ మాదిరిగా.. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున సామూహిక ఖననాలు జరిగినట్లు శాటిలైట్ ఫొటోల ద్వారా తెలిసిందని వెల్లడించింది.

మరియుపోల్ సిటీని కైవసం చేసుకున్నామంటూ గురువారం రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన కొన్ని గంటలకే అమెరికాకు చెందిన మ్యాక్సర్ టెక్నాలజీస్ సంస్థ సిటీలోని శ్మశానవాటికల వద్ద సామూహిక ఖననాలు జరిగాయంటూ శాటిలైట్ ఫొటోలను విడుదల చేసింది. మరియుపోల్ సమీపంలోని మన్హుష్ టౌన్ శ్మశానవాటికలో కొత్తగా భారీ సమాధులు తవ్వి పూడ్చివేసినట్లు శాటిలైట్ ఫొటోల్లో తేలిందని ఆ సంస్థ వెల్లడించింది.

రష్యన్ సోల్జర్లు సిటీలోని సాధారణ పౌరులను ఊచకోత కోస్తున్నారని, ఈ ఘోరం బయటపడకుండా ఉండేందుకు సిటీ బయట ఉన్న మన్హుష్ శ్మశానవాటికలో పూడ్చేస్తున్నారని మరియుపోల్ మేయర్ వదీమ్ బాయ్ చెంకో ఆరోపించారు. ట్రక్కుల్లో మృతదేహాలను తెచ్చి.. సమాధుల్లో డంప్ చేస్తున్నారని మండిపడ్డారు. రష్యన్ల నరమేధాన్ని చూస్తుంటే నాజీల దురాగతాలను తలపిస్తోందన్నారు. ఫొటోల్లోని కొత్త సమాధులను బట్టి.. సుమారు 9 వేల మందిని పూడ్చేసి ఉండొచ్చని మరియుపోల్ సిటీ కౌన్సిల్ వెల్లడించింది.
అయితే, ఇంతకుముందు బుచా సిటీలోనూ ఇలాంటి సమాధులు వెలుగు చూడగా.. తాము సాధారణ ప్రజలను చంపలేదంటూ రష్యా ఖండించింది. ఇప్పుడు మరియుపోల్ సామూహిక ఖననాలపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.