ఉద్యోగం రాలేదని నిరుద్యోగి ఆత్మహత్య

ఉద్యోగం రాలేదని నిరుద్యోగి ఆత్మహత్య
  • వికారాబాద్ కుల్కచర్లలో ఘటన 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌/పరిగి, వెలుగు: జాబ్ రాలేదని మనస్తాపానికి గురై మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన శివాని శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌(35) బీటెక్ పూర్తి చేశాడు. గ్రూప్స్‌‌‌‌‌‌‌‌కి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో ఇంజనీరింగ్ చదివినా ఉద్యోగం రాలేదని, పెండ్లి కూడా కాలేదని చుట్టుపక్కలోళ్లు హేళన చేశారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్.. మంగళవారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరి వేసుకున్నాడు. తల్లి సత్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శ్రీనివాస్ తండ్రి 25 ఏండ్ల క్రితమే చనిపోయాడు. తల్లి సత్యమ్మనే ముగ్గురు కొడుకులను చూసుకుంటోంది. శ్రీనివాసే అందరిలో పెద్దవాడు. సత్యమ్మ వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. వీరికి ఎకరం పొలం, రూ.లక్షకు పైగా అప్పు ఉన్నట్లు తెలిసింది.
ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్.. 
తన చావుకు ఎవరూ కారణం కాదంటూ శ్రీనివాస్ రాసినట్టుగా చెబుతున్న సూసైడ్ నోట్ ఒకటి సోషల్ మీడియా వైరల్ అయింది. ‘‘ఏ తప్పు చేయకున్నా నిజాయితీని నిరూపించుకోలేక ఒక చెడ్డ వాడిని అనే అవమాన భారాన్ని భరించలేక, అందరినీ నా వాళ్లు అని నమ్మి టోటల్ గా నా లైఫ్ ను నాశనం చేసుకున్నా. అందుకే సూసైడ్ చేసుకుంటున్నా. నా చావుకు ఎవ్వరూ కారణం కాదు. నేను అందరితో స్నేహపూర్వకంగా ఉండకపోవడం కూడా ఒక కారణం” అని అందులో ఉంది. అయితే శ్రీనివాస్ మంగళవారం రాత్రి ఉరేసుకుంటే, నోట్ పై బుధవారం నాటి తేదీ ఉంది. దానిపై అతని సంతకం కూడా లేదు.