శత్రు ఆస్తుల అమ్మకం ప్రక్రియను ప్రారంభించిన కేంద్రం

శత్రు ఆస్తుల అమ్మకం ప్రక్రియను ప్రారంభించిన కేంద్రం

న్యూఢిల్లీ: పాకిస్తాన్​, చైనా దేశాల పౌరసత్వం తీసుకున్నవారు మనదేశంలో వదిలివెళ్లిన ఆస్తుల అమ్మకానికి సంబంధించిన ప్రక్రియను కేంద్ర హోం శాఖ ప్రారంభించింది. ప్రస్తుతం ఆక్రమణదారుల చెరలో ఉన్న ఇలాంటి ఆస్తులను విడిపించేందుకు కూడా సర్కారు కసరత్తును మొదలుపెట్టింది. ఈ ఆస్తులను లీగల్​భాషలో శత్రు ఆస్తులు (ఎనిమీ ప్రాపర్టీస్) అంటారు. మనదేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 12,611 ఎనిమీ ప్రాపర్టీస్ ఉండగా,​వాటి మొత్తం విలువ రూ.లక్ష కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్​ద్వారా ఏర్పాటైన కస్టోడియన్​ఆఫ్​ ఎనిమీ ప్రాపర్టీ ఫర్​ఇండియా(సెపీ) సంస్థ పరిధిలోకి ఈ ఆస్తులన్నీ వస్తాయి. ఎనిమీ ప్రాపర్టీస్ ను కబ్జాల నుంచి విడిపించడానికి, విక్రయించడానికి సంబంధించిన మార్గదర్శకాల్లో కేంద్ర హోంశాఖ తాజాగా పలు మార్పులు చేసింది. వీటి ప్రకారం..జిల్లా మెజిస్ట్రేట్​ లేదా డిప్యూటీ కమిషనర్​ సహకారంతో ఈ ఆస్తులను కబ్జాదారుల గుప్పిట్లో నుంచి విడిపిస్తారు. ఈక్రమంలో రూ.కోటిలోపు విలువ చేసే ఎనిమీ ప్రాపర్టీ ఒకవేళ ఎవరి కబ్జాలోనైనా ఉంటే.. ఆ కబ్జా చేసిన వ్యక్తికే కొనుగోలు చేసే తొలి చాన్స్​ ఇస్తారు. ఒకవేళ అతడు కొనుగోలుకు నిరాకరిస్తే, దాన్ని కేంద్రం చట్టప్రకారం అధీనంలోకి తీసుకొని ఇతరులకు విక్రయిస్తుంది. రూ.కోటి నుంచి రూ.100 కోట్లలోపు విలువ కలిగిన ఎనిమీ ప్రాపర్టీస్​ను మెటల్ స్క్రాప్​ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్​ కు చెందిన ఈ–ఆక్షన్​ ప్లాట్​ఫామ్​ ద్వారా ‘సెపీ’ సంస్థ వేలం  వేస్తుంది.  దీనికి సంబంధించిన రేటును ఎనిమీ ప్రాపర్టీ డిస్పోజల్​ కమిటీ డిసైడ్​ చేస్తుంది.