- హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి రూ. కోటి విలువైన వైద్య పరికరాలు అందజేత
హుస్నాబాద్, వెలుగు: పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న అత్యాధునిక పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని, ఇకపై ఒక్క రోగిని కూడా ప్రైవేట్‌ఆస్పత్రులకు పంపించొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డాక్టర్లు, సిబ్బందికి సూచించారు. సోమవారం ఎన్ఎమ్ డీసీ సీఎస్సార్ ఫండ్‌తో సమకూర్చిన రూ.కోటి విలువైన 15 రకాల వైద్య పరికరాలను హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి అందించారు. అనంతరం మాట్లాడుతూ..కేంద్రం ఇస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ నిధులతోనే రాష్ట్రంలోని సర్కార్ ఆస్పత్రులు నడుస్తున్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సరైన నిధులు ఇవ్వకపోవడం వల్లే ఆస్పత్రుల్లో మందులు, చిన్న పరికరాల కొనుగోలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. కుక్క కాటుకు మందు లేదనే వార్తలొస్తున్నాయని, సూది మందులు, కనీస సౌకర్యాలు లేకపోతే పేదల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గతంలోనూ కోట్ల రూపాయలతో పరికరాలు, అంబులెన్సులు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన తారవ్వకు ఇటీవల మంత్రి ఆర్థిక సాయం చేయగా ఆమె మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అయన వెంట పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, నాయకులు లక్కిరెడ్డి తిరుమల, తోట స్వరూప, దొడ్డి శ్రీనివాస్, ఖమ్మం వెంకటేశం, మహేందర్ రెడ్డి ఉన్నారు.
