గెలిస్తే కేంద్ర మంత్రి పదవి!

గెలిస్తే కేంద్ర మంత్రి పదవి!
  •     కాంగ్రెస్, బీజేపీ ఎంపీ అభ్యర్థుల్లో సీనియర్ లీడర్ల ధీమా
  •     క్యాడర్ కు బూస్టింగ్ ఇచ్చేందుకే..
  •     ఇంటర్నల్ మీటింగ్స్ లోనూ ఇదే ప్రచారం
  •     సంజయ్, అరవింద్, ఈటల, 
  •     జీవన్ రెడ్డి, బలరాం నాయక్ ఆశలు

కరీంనగర్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో గెలిస్తే ఈ సారి కేంద్ర మంత్రి పదవి ఖాయమని రాష్ట్రంలో కొందరు కాంగ్రెస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. కేంద్రంలో  ఈ దఫా కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని,  ఇక్కడ తనను గెలిపిస్తే కేంద్ర మంత్రి కావడం ఖాయమని కొందరు  కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే, బీజేపీ ఎంపీ అభ్యర్థులు కూడా కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, తమను రెండోసారి గెలిపిస్తే సెంట్రల్​మినిస్ట్రీ ఖాయమని సిట్టింగ్ ఎంపీలు చెప్పుకుంటున్నారు. ఇదే విషయాన్ని వారి అనుచరులు కూడా ప్రచారంలో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. 

ఆశల్లో  సీనియర్లు.. 

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు యూనియన్ కేబినెట్ లో బెర్త్ కన్ఫామ్​అనే విశ్వాసంతో ఆ పార్టీ నిజామాబాద్ అభ్యర్థి జీవన్ రెడ్డి, మహబూబాద్ అభ్యర్థి బలరాం నాయక్ ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  ఆ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న జీవన్ రెడ్డికి రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ జోరుగా సాగుతోంది. అలాగే గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన బలరాం నాయక్  మరో సారి మహబూబాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సారి ఆయన గెలిస్తే మళ్లీ మంత్రి అవుతారనే ప్రచారం జరుగుతోంది.

  బీజేపీ అభ్యర్థుల విషయంలోనూ ఇదే రకమైన చర్చ నడుస్తోంది. కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ మరోసారి ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలో పార్టీ బలో పేతమయ్యేందుకు తీవ్రంగా కృషి చేశారనే పేరుంది. దీంతో సంజయ్ రెండో సారి గెలిస్తే తప్పకుండా కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ఆ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. నిజామాబాద్ అభ్యర్థి ధర్మపురి అరవింద్, మేడ్చల్ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా తాము గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవో, సహాయ మంత్రి పదవో ఖాయమనే ధీమాతో ఉన్నట్లు తెలిసింది.

ఉత్సాహాన్ని నింపేందుకు...

వాస్తవానికి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంలో క్లారిటీ లేదు. ఏయే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే విషయం ఫలితాలు వస్తేగానీ తెలియదు. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యమయ్యే పార్టీలను బట్టి మంత్రి పదవుల అడ్జస్ట్ మెంట్ ఉంటుంది. దీంతో
 ఏ రాష్ట్రానికి ఎన్ని మినిస్ట్రీలు వస్తాయి.. అవి ఎవరికి వస్తాయనే విషయంలో స్పష్టత లేదు. లీడర్లు మాత్రం తమ క్యాడర్​లో ఉత్సాహం నింపేందుకు,  ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు సెంట్రల్ మినిస్టర్  పదవి అస్త్రాన్ని వాడుతున్నారనే చర్చ సాగుతోంది.