ఎల్లుండి నుంచి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర

ఎల్లుండి నుంచి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర
  • 3రోజులు 384 కిలోమీటర్లు సాగనున్న కిషన్ రెడ్డి యాత్ర
  • 12 జిల్లాలు 18 అసెంబ్లీ నియోజకవర్గాలు,7 పార్లమెంటునియోజకవర్గాల గుండా సాగనున్న యాత్ర
  • కిషన్ రెడ్డి యాత్ర మధ్యలో 40 చోట్ల సభలు

హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ పాలన 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రకు ‘‘జన ఆశీర్వాద యాత్ర’’గా నామకరణం చేశారు. యాత్ర పొడవునా బీజేపీ ప్రభుత్వ విజయాలు, సంక్షేమ కార్యక్రమాలను కిషన్ రెడ్డి వివరిస్తూ ముందుకు సాగుతారు. ఈనెల 19న అంటే ఎల్లుండి నుంచి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభం అవుతుంది. 3 రోజులపాటు 384 కిలోమీటర్లు సాగనున్న ఈ యాత్ర 12 జిల్లాలు, 18 అసెంబ్లీ నియోజకవర్గాలు,7 పార్లమెంటు నియోజకవర్గాల గుండా వెళుతుంది. కిషన్ రెడ్డి యాత్ర మధ్యలో 40 చోట్ల సభలు ఏర్పాటు చేశాయి బీజేపీ శ్రేణులు. 
జన ఆశీర్వద యాత్ర ఇంచార్జ్ గా ప్రేమేందర్ రెడ్డి 
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టనున్న జన ఆశీర్వాద యాత్రకు ఇంచార్జ్ గా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డిని నియమించారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. యాత్ర ఆద్యంతం.. సభలు, సమావేశాలు తదితర వివరాలన్నీ ఆయన స్వయంగా పర్యవేక్షిస్తారు. జన ఆశీర్వాద యాత్రలో బాగంగా ముందుగా  18న అంటే రేపు బుధవారం కిషన్ రెడ్డి తిరుమల చేరుకుంటారు. 19న ఉదయమే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం  విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకుని కోదాడకు బయలుదేరుతారు. 19 సాయంత్రం 4 గంటలకు కోదాడ  తిరుమలపూర్ గ్రామం  చేరుకుంటారు. ఇక్కడి నుంచే కిషన్ రెడ్డియాత్ర ప్రారంభమై మూడు రోజులపాటు సాగుతుంది. 
384 కిలోమీటర్ల పాటు సాగనున్న యాత్ర మొత్తం 18 అసెంబ్లీ నియోజకవర్గాలు, 12 జిల్లాలు, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా యాత్ర జరుగుతుంది. యాత్ర మధ్యలో అక్కడక్కడ మొత్తం 40 చోట్ల సభలకు ఏర్పాట్లు చేశారు. 
యాత్రలో భాగంగా సేంద్రియ వ్యవసాయంలో జాతీయ అవార్డు గ్రహీతను కోదాడలో సన్మానిస్తారు. అలాగే వరంగల్ లో భద్రకాళి టెంపుల్, రామప్ప దేవాలయం సందర్శిస్తారు కిషన్ రెడ్డి. అదేవిధంగా హన్మకొండ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అలాగే ఆలేరులో చేనేత కార్మికుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింద మల్లేశంని కలుస్తారు. చివరగా ఈనెల 21న సాయంత్రం 7 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు.