దళితబంధు యూనిట్లు: దారి మళ్లాయి..

దళితబంధు యూనిట్లు: దారి మళ్లాయి..

 

  • ఫీల్డ్  ఎంక్వైరీలో గుర్తించిన అధికారులు 

  • గతంలో పైలట్  ప్రాజెక్టుగా ఎంపికైన చింతకాని మండలం

  • 3,462 యూనిట్లలో 1,387 యూనిట్లు పక్కదారి పట్టినట్లు గుర్తింపు 

  • సక్సెస్​ ఫుల్ గా నడుపుకుంటున్నది 1,157 మందే 

ఖమ్మం, వెలుగు:  చింతకాని మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఖమ్మంలోని ఒక కార్ల షోరూమ్​ లో మెకానిక్​ గా పని చేస్తున్నాడు. అతనికి దళితబంధు కింద యూనిట్​ మంజూరు కాగా, సెవన్​ సీటర్​ కారును కొనుక్కున్నాడు. ఏడాది తర్వాత కారును సగం రేటుకే బేరానికి పెట్టాడు. విషయం తెలిసిన మరో వ్యక్తి రూ.4 లక్షలకు బేరమాడాడు. రూల్స్ ప్రకారం కొనుగోలుదారుడి పేరు మీద రిజిస్ట్రేషన్​ చేసే అవకాశం లేకపోవడంతో రూ.50 వేలు తక్కువగా ఇచ్చి, నిర్ణీత గడువు ముగిసిన తర్వాత రిజిస్ట్రేషన్​ చేసేలా అగ్రిమెంట్ రాసుకున్నారు. లచ్చగూడెంకు చెందిన మరో లబ్దిదారుడు రూ.5 లక్షల విలువైన సెంట్రింగ్  యూనిట్ ను లక్షన్నరకే అమ్ముకున్నట్టు సమాచారం.

బీఆర్ఎస్  ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంలో యూనిట్లు పక్కదారి పట్టాయి. ఏరికోరి నచ్చిన యూనిట్లను ఎంచుకున్న లబ్దిదారులు, ఆ తర్వాత కొద్ది రోజులకే వాటిని తెగనమ్ముకున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లా ఎస్సీ కార్పొరేషన్​ అధికారులు చేసిన ఫీల్డ్  ఎంక్వైరీలో ఈ విషయాన్ని గుర్తించారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా చింతకాని మండలాన్ని ఎంపికచేశారు. మండలంలో 3,462 కుటుంబాలకు గత ప్రభుత్వ హయాంలో వివిధ రకాల యూనిట్లు అందజేశారు. ఇందులో 2,544 కుటుంబాలకు 100 శాతం పథకాన్ని వర్తింపజేయగా, వాటిలో 1,157 యూనిట్లు మాత్రమే ప్రస్తుతం విజయవంతంగా లబ్దిదారులు నిర్వహించుకుంటున్నారని ఆఫీసర్ల ఫీల్డ్  ఎంక్వైరీలో తేలింది. మిగిలిన 1,387 యూనిట్లు పక్కదారి పట్టాయని గుర్తించారు. 847 కుటుంబాలకు పాక్షికంగా యూనిట్లను అందజేశారు. కొంతమంది లబ్ధిదారులు మాత్రమే తాము ఇతరులకు యూనిట్లను లీజ్​ కు ఇచ్చినట్టుగా లీజ్​ పత్రాలను చూపిస్తుండగా, ఎక్కువ మంది దగ్గర ఎలాంటి పేపర్లు లేవు. బర్రెలు తమ కొడుకు ఇంటి దగ్గర ఉన్నాయని కొందరు, గొర్రెలు కూతురికి ఇచ్చామని ఇంకొందరు, వాహనాలను వేరే దగ్గర ట్రావెల్స్​ లో పెట్టామని మరికొందరు సమాధానం చెబుతున్నారు. వారికి కౌన్సెలింగ్  చేసిన తర్వాత అవన్నీ పక్కదారి పట్టాయని ఆఫీసర్లు గుర్తించారు. 

అవగాహన కల్పించినా..

2021లో అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం చింతకాని మండలాన్ని పైలెట్  ప్రాజెక్టు కోసం ఎంపిక చేసింది. ప్రతి గ్రామానికి ఒక జిల్లా స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్​ గా నియమించి, యూనిట్లపై ముందుగా లబ్దిదారులకు అవగాహన కల్పించిన తర్వాత వారి కోరిక మేరకే యూనిట్లను ఇప్పించారు. మండలంలో లబ్ధిదారులుగా గుర్తించిన 3,462 మందికి యూనిట్లు అందజేయగా, ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించిన సమయంలో యూనిట్లు పక్కదారి పట్టిన విషయాన్ని ప్రస్తావించారు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని, ఆయా యూనిట్లు తిరిగి లబ్ధిదారులకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యూనిట్లను బెదిరించి లాక్కున్న వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్  ఇచ్చారు. దీంతో ఆఫీసర్లు ఆయా గ్రామాల్లో ఫీల్డ్  సర్వే చేసి వాస్తవ నివేదికను భట్టికి అందజేశారు. మండలంలో పాక్షికంగా యూనిట్లు అందిన 847 మందికి రూ.15.54 కోట్లను మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి అందజేశారు. అయితే యూనిట్  విలువలో సగం ధరకే లబ్దిదారులు వాటిని అమ్ముతుండడంతో, ఇతరులు వాటిని కొనుక్కొని నడిపించుకుంటున్నారు. సాంకేతికంగా వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియ మారకుండా అడ్డంకులు ఉండడంతో, లబ్ధిదారుల పేరు మీదనే వాటిని కొనసాగిస్తున్నారు.  

తిరిగి ఇప్పించడంపై నజర్..

దళితబంధు పథకం కింద ఎస్సీలకు 100 శాతం సబ్సిడీ మీద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అప్పటి ప్రభుత్వం యూనిట్లను మంజూరు చేసింది. అయితే ప్రస్తుతం 1,387 యూనిట్లలో వ్యవసాయరంగానికి సంబంధించి 200 యూనిట్లు, రిటైల్  అండ్  సేల్స్  రంగానికి చెందిన 100 యూనిట్లు, సర్వీస్​ సెక్టార్​ కు సంబంధించి 120 యూనిట్లు, ట్రాన్స్ పోర్ట్  రంగానికి చెందిన 300 యూనిట్లు, పశుసంవర్ధక శాఖకు చెందిన 300 యూనిట్లు పక్కదారి పట్టాయని అధికారులు గుర్తించారు. యూనిట్లను సొంతంగా నడిపించుకుంటూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని లబ్ధిదారులను ఎడ్యుకేట్  చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. దారిమళ్లిన యూనిట్లను తిరిగి లబ్ధిదారుల దగ్గరకి చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అంటున్నారు.