పంజాబ్ ​వ్యవహారాలకు  యోగి దూరంగా ఉంటే మంచిది

పంజాబ్ ​వ్యవహారాలకు  యోగి దూరంగా ఉంటే మంచిది

లక్నో: పంజాబ్‌‌‌‌‌‌‌‌లో కొత్త జిల్లాగా మలేర్ కోట్లాను ఏర్పాటు చేస్తున్నట్లు అమరీందర్​సింగ్ ​ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉత్తరప్రదేశ్​సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్​ విభజన విధానాన్ని ఇది ప్రతిబింబిస్తోంది..’ అని అన్నారు. ‘విశ్వాసం, మతం ఆధారంగా తీసుకున్న ఏ నిర్ణయమైనా భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే.. పంజాబ్​లో మలేర్ కోట్లాను జిల్లాగా ఏర్పాటు చేయడం కాంగ్రెస్​ విభజన విధానానికి ఓ నిదర్శనం..’ అంటూ శనివారం యోగి ట్వీట్​చేశారు.​ ముస్లింలు మెజారిటీగా ఉన్న మలేర్ కోట్లాను​23వ జిల్లాగా ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం రంజాన్​ సందర్భంగా సీఎం అమరీందర్​సింగ్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంపై యూపీ సీఎం విమర్శిస్తూ చేసిన ట్వీట్​పై అమరీందర్ ​సింగ్​ ఘాటుగానే స్పందించారు. పంజాబ్ ​వ్యవహారాలకు  యోగి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కౌంటర్​ఇచ్చారు. ‘గత నాలుగేళ్లుగా యూపీలో మత విభేదాలను పోత్సహిస్తూ అనుసరిస్తున్న విభజన, విధ్వంసక బీజేపీ ప్రభుత్వ విధానాలేవి పంజాబ్​లో లేవు. పంజాబ్​ నీతి గురించి, మలేర్​కోట్లా చరిత్ర గురించి ఆయనకు (యోగి ఆదిత్యనాథ్) ఏం తెలుసు? భారత రాజ్యాంగాన్ని ఆయనెలా అర్థం చేసుకున్నారో కానీ.. యూపీలో తన సొంత ప్రభుత్వమే నిత్యం దాన్ని ఉల్లంఘిస్తోంది’ అని అమరీందర్ ఒక ప్రకటనలో మండిపడ్డారు.