మేమూ గూఢచర్యం చేస్తం.. డ్రాగన్ సైబర్ దాడులపై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

మేమూ గూఢచర్యం చేస్తం.. డ్రాగన్  సైబర్  దాడులపై యూఎస్  ప్రెసిడెంట్  ట్రంప్  సంచలన వ్యాఖ్యలు
  • వారు ఏం చేస్తే.. తామూ అదే చేస్తామని వెల్లడి
  • చైనా పర్యటన ముగించుకొని అమెరికాకు చేరుకున్న ట్రంప్
  • ఇరాన్​తో చర్చలు విఫలమైతే.. మళ్లీ దాడులకు ప్లాన్?

వాషింగ్టన్: చైనా, అమెరికా మధ్య పరస్పర సైబర్ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సంచల వ్యాఖ్యలు చేశారు. చైనా.. అమెరికాలో సైబర్​ దాడులు చేస్తే.. తాము కూడా వారిపై విపరీతంగా గూఢచర్యం చేస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు. బీజింగ్‌‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌‌పింగ్‌‌తో రెండు రోజుల సుదీర్ఘ దౌత్య సమావేశం ముగించుకుని ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంలో తిరిగి అమెరికాకు వస్తున్న సమయంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. 

చైనా.. అమెరికాపై జరిపిన సైబర్ దాడుల గురించి చైనా అధ్యక్షుడు  జిన్‌‌పింగ్‌‌తో చర్చించారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ట్రంప్ స్పందిస్తూ.. ‘అవును, చర్చించాను. చైనాపై మేము చేసిన దాడుల గురించి ఆయన మాట్లాడారు. వారు ఏమి చేస్తారో, మేము కూడా అదే చేస్తాము’ అని అన్నారు. చైనాపై అమెరికా కూడా పెద్ద ఎత్తున సైబర్ ఆపరేషన్లు, గూఢచర్యం నిర్వహిస్తుందని ఆయన బహిరంగంగానే అంగీకరించారు. అంతేకాకుండా, తాను జిన్‌‌పింగ్‌‌తో.. ‘మీకు తెలియకుండా మేము మీపై చాలా పనులు (సైబర్ దాడులు) చేస్తున్నాం. అలాగే, మీరు మాపై చేస్తున్న పనులు బహుశా మాకు తెలిసి ఉండవచ్చు. కానీ, మేము కూడా తక్కువేం చేయడం లేదు. ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది’ అని చెప్పినట్టు ట్రంప్ పేర్కొన్నారు.  

  • ఇరాన్‌‌పై భారీ దాడులకు సిద్ధం?

చైనా పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగి వచ్చిన ట్రంప్.. ఇరాన్‌‌పై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిసింది. ఇరాన్​తో దౌత్యపరమైన చర్చలు విఫలమైతే, సైనిక బలగాల ద్వారా మళ్లీ వైమానిక దాడులు చేసేందుకు అమెరికా ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ దాడులు చేయాల్సి వస్తే 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0ని పునఃప్రారంభించడానికి పెంటగాన్ సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. అయితే, ఇరాన్​పై వచ్చే వారమే దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రాంతీయ నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. కాల్పుల విరమణ తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇప్పటివరకు లేనంత భారీ స్థాయిలో సంయుక్త సన్నద్ధతలో నిమగ్నమయ్యాయని ఇద్దరు పశ్చిమాసియా అధికారులు వెల్లడించారు. 

  • తైవాన్ పై మాట మార్చిన ట్రంప్.. దీటుగా బదులిచ్చిన తైపీ 

ఇప్పటివరకూ తైవాన్ కు మద్దతు ఇచ్చిన ట్రంప్ తాజాగా చైనా పర్యటన ముగింపు తర్వాత మాట మార్చారు.  తైవాన్ అధికారికంగా స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవడాన్ని తాము సమర్థించబోమని, చైనాతో యుద్ధానికి సిద్ధంగా లేమన్నారు. ఇరుపక్షాలు శాంతించాలని కోరారు. దీనిపై తైవాన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ.. తమది పూర్తి సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం కలిగిన ‘స్వతంత్ర’ దేశమని స్పష్టం చేసింది. తైవాన్ ఎప్పటికీ చైనాకు లోబడి ఉండదని తేల్చిచెప్పింది. అమెరికా నుంచి తాము కొనుగోలు చేసే ఆయుధాలు, ఉభయ దేశాల మధ్య ఉన్న 'తైవాన్ రిలేషన్స్ యాక్ట్' భద్రతా ఒప్పందంలో భాగమేనని సమర్థించుకుంది.

  • ఐసిస్ నంబర్-2 టెర్రరిస్ట్ హతం 

ఐసిస్ టెర్రరిస్ట్ సంస్థ రెండో అత్యున్నత కమాండర్‌‌గా ఉన్న అబు-బిలాల్ అల్-మినుకి నైజీరియాలో హతమయ్యాడని ట్రంప్ ప్రకటించారు. అమెరికా, నైజీరియా సాయుధ దళాలు పక్కా ప్రణాళికతో ఉమ్మడిగా నిర్వహించిన క్లిష్టమైన ఆపరేషన్‌‌లో అతడిని హతమార్చినట్లు చెప్పారు. ‘ఆఫ్రికాలో అల్-మినుకి కదలికలపై మా బలగాలు నిరంతరం నిఘా ఉంచాయి. ఇకపై అతను ఆఫ్రికా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయలేడు. అతడి అంతంతో ఐసిస్ ప్రపంచ నెట్‌‌వర్క్ బలహీనపడింది’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు.

  • ఫోన్లు లేకుండానే చైనాకు.. చైనా గిఫ్ట్​లు చెత్తబుట్టలోకి 

చైనా పర్యటనకు వెళ్లిన ట్రంప్, ఆయన బృందం సైబర్ దాడుల ముప్పు నేపథ్యంలో తమ వ్యక్తిగత సెల్ ఫోన్లను అమెరికాలోనే వదిలివెళ్లారు. గూఢచర్యం, హ్యాకింగ్ ముప్పును తప్పించుకోవడానికి పరిమిత సేవలు ఉండే క్లీన్ డివైజ్‌‌లు, తాత్కాలిక లాప్‌‌ట్యాప్‌‌లు, ప్రత్యేక కమ్యూనికేషన్ సిస్టమ్‌‌లను మాత్రమే తీసుకెళ్లినట్టు ‘ఫాక్స్’ న్యూస్ వెల్లడించింది. అలాగే, పర్యటన ముగిసిన తర్వాత చైనా అందజేసిన డివైజ్‌‌లను, బహుమతులను అమెరికా అధికారులు ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కే మెట్ల వద్ద ఉన్న చెత్తబుట్టలోనే పడేశారు. 

అమెరికాకు తిరిగి రావడానికి విమానం ఎక్కే ముందు వైట్ హౌస్ సిబ్బంది, సీక్రెట్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు చైనా గిఫ్ట్ లుగా ఇచ్చిన వస్తువులను సేకరించి, అక్కడే పారేశారు. తాత్కాలిక 'బర్నర్' స్మార్ట్‌‌ఫోన్‌‌లు, అధికారిక ఐడెంటిటీ కార్డులు, డెలిగేషన్ లాపెల్ పిన్స్, జ్ఞాపికలు, బహుమతుల బ్యాగ్‌‌లను సైతం భద్రతా కారణాల దృష్ట్యా విమానం లోపలికి అనుమతించకుండా చెత్తబుట్టలో పారేసిపోయారు.