మోడీ, పుతిన్, జిన్‌పింగ్ సమావేశంతో ఉలిక్కిపడ్డ అమెరికా: ఇండియాని పొగుడుతూ ట్వీట్...

మోడీ, పుతిన్, జిన్‌పింగ్ సమావేశంతో ఉలిక్కిపడ్డ అమెరికా: ఇండియాని పొగుడుతూ ట్వీట్...

షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దీనిని ఆసియా భౌగోళిక రాజకీయాల్లో మారిన పరిస్థితులకు ఒక ముఖ్య  సంకేతంగా చాలామంది భావించారు. మరోవైపు ఈ సమావేశం అమెరికాను ఆందోళనకు గురి చేసింది. దీంతో అమెరికా ప్రభుత్వం ఢిల్లీతో సంబంధాలను పునఃసమీక్షించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఈ తరుణంలో సోషల్ మీడియాలో భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం ఒక పోస్ట్ పెట్టింది. అందులో వాషింగ్టన్, ఢిల్లీ మధ్య ఉన్న స్నేహాన్ని ప్రశంసించింది. దీన్ని బట్టి చూస్తే  అమెరికా, భారతీయ వస్తువులపై భారీగా విధించిన సుంకాలను తిరిగి పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తుంది. 

పోస్ట్‌తో పాటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఫోటోని  కూడా షేర్ చేసింది. అందులో  మన రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న శాశ్వత స్నేహం మన సహకారానికి పునాది, మన ఆర్థిక సంబంధాల గొప్ప సామర్థ్యాన్ని తెలుసుకునేలా చేస్తుంది అని రాసి ఉంది. 

టియాంజిన్‌లో ప్రధాని మోడీ, పుతిన్, జిన్‌పింగ్‌లతో మాట్లాడుకుంటున్న ఫోటోలు కూడా తెగ  వైరల్ అయ్యాయి. అమెరికా రాయబార కార్యాలయం చేసిన పోస్ట్, ఈ ఫోటోలు బయటికి వచ్చిన కొన్ని గంటల తర్వాత వచ్చింది.

ఈ ముగ్గురు ప్రపంచ నాయకుల మధ్య చర్చ అమెరికా భారత్ పై ఒత్తిడి పెంచుతున్న సమయంలో జరిగింది. వాషింగ్టన్ మొదట చైనాపై సుంకాలు విధించింది. తరువాత భారతదేశం పై విమర్శలు చేస్తూ  భారతీయ వస్తువులపై 50 శాతం సుంకాలు విధించింది. సుంకాల యుద్ధాల నేపథ్యంలో భారతదేశం, చైనా, రష్యా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం అమెరికాకు మరింత ఆందోళన కలిగించింది.