నా సెగ్మెంట్లో నీ పెత్తనమేంది? ఖబడ్దార్.. ఎర్రబెల్లి! : ఎమ్మెల్యే నాగరాజు

నా సెగ్మెంట్లో నీ పెత్తనమేంది? ఖబడ్దార్.. ఎర్రబెల్లి! : ఎమ్మెల్యే నాగరాజు
  • వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు వార్నింగ్
  • రేషన్ బియ్యం దందాలు చేసిన నీ వ్యాఖ్యలు సిగ్గుచేటు
  • స్థానిక ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని సవాల్


వర్దన్నపేట,వెలుగు : “ నా సెగ్మెంట్ లో నీ పెత్తనమేంది..? బీఆర్ఎస్ లో దళితులు లేరా..? ఇంకా దళితులను అణగదొక్కుడేనా..? మా జోలికి వస్తే ఖబడ్దార్.. ఎర్రబెల్లి..!’’ అంటూ.. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు వార్నింగ్ ఇచ్చారు. సోమవారం క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే నాగరాజు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పాలకుర్తిలో ఓడిపోయిన ఎర్రబెల్లి దయాకర్ రావు మతిభ్రమించి..  ఏమి చేయాలో తోచక వర్ధన్నపేటలో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​గెలదని, ఎమ్మెల్యేకు ప్రజాదరణ తగ్గుతుందని గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డాడు. లోకల్ బాడీస్ లో కాంగ్రెస్​అధిక స్థానాలు గెలిచి తమ సత్తా ఏమిటో చూపిస్తామని సవాల్ చేశారు. 

ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు అవాస్తవమని, అతడి చరిత్ర అందరికీ తెలుసని, రేషన్ బియ్యం అమ్ముకొని దందాలు చేసిన ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శించారు. ఈనెల 4న హైదరాబాద్ ఎల్ బీ స్టేడియంలో 15వేల మందితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన గ్రామస్థాయి నేతలతో బహిరంగసభ నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి సెగ్మెంట్ నుంచి 500 మందికి తగ్గకుండా తరలించి సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.