
హసన్ పర్తి, వెలుగు : రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ నాయకులకు లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శనివారం రెండో డివిజన్ వంగపాడులో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. శుక్రవారం వంగపహడు పీఏసీఎస్ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేస్తలేరని మాజీ మంత్రి దయాకర్ రావు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, వారు పండించి ప్రతి గింజనూ కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
రైతులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఎర్రబెల్లి మాట్లాడే ముందు కళ్లద్దాలు తీసి నిజాలు మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో కిసాన్ జిల్లా హనుమకొండ అధ్యక్షుడు పింగిలి వెంకట నరసింహ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ తంగళ్లపల్లి తిరుపతి, పాక్స్ చైర్మన్ బిల్ల ఉదయ రెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పొలం అనిల్ రెడ్డి, మాజీ వరంగల్ మార్కెట్ డైరెక్టర్ వీసం సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.